- హౌసింగ్ బోర్డు కాలనీలో 24/7 తాగునీటికి శ్రీకారం
- మల్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, డిజిటల్ క్లాస్ రూమ్ లు ప్రారంభం
- హాజరైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఖట్టర్, బండి, పొన్నం, పొంగులేటి, ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్, వెలుగు: స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.18 కోట్లతో నిర్మించిన 24/7 తాగునీటి సరఫరా పథకానికి శ్రీకారం చుట్టడంతోపాటు ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని మల్టీపర్పస్ పార్కు, కుమ్మర్‌వాడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ లు, బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు.
అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్వహించిన బహిరంగ సభకు మంత్రులు హాజరై మాట్లాడారు. ఒకే వేదికపై మూడు ప్రధాన పార్టీల నాయకులు కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. ‘కరీంనగర్ పౌరులారా నమస్తే..’ అంటూ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కొద్దిసేపు తెలుగులో ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం..
కరీంనగర్ ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యను సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఈ సమస్యను పరిష్కరిస్తామని, అందుకయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని కేంద్ర మంత్రి ఖట్టర్ సభలో ప్రకటించడంతో కరీంనగర్ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్‌ను నంబర్ వన్ గా తీర్చిదిద్దుదాం: పొన్నం
కరీంనగర్ జిల్లాను అభివృద్ధిలో నంబర్ వన్ చేసేందుకు రాజకీయాలకతీతంగా ప్రతిఒక్కరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఎన్నోసార్లు మంత్రులను కలిశానని వెల్లడించారు. 2017లో వరంగల్ తోపాటు హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేస్తే.. అప్పుడు ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ కరీంనగర్‌ను చేర్చేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎంపీ బండి సంజయ్ సహకారంతో రూ.400 కోట్ల నిధులు విడుదల అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా స్మార్ట్ సిటీ కోసం రూ.396 కోట్లు విడుదల చేసిందని చెప్పారు.
మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తి చేయండి
దక్షిణభారతదేశంలోనే తొలిసారిగా కరీంనగర్ సిటీకి తలమానికంగా ప్రారంభించిన మానేరు రివర్ ఫ్రంట్ పనులను కంప్లీట్ చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి ఖట్టర్ ను కోరారు. రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరని, ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగొద్దన్నారు. కరీంనగర్‌ను టూరిజం హబ్‌గా మార్చేందుకు మానేరు రివర్ ఫ్రంట్‌ను ప్రారంభించామని, పనులు పూర్తి చేయడానికి మరో రూ.300 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.