స్మార్ట్ సిటీ పనులకు రాష్ట్ర సర్కార్ దన్ను

  • రూ.100 కోట్ల మ్యాచింగ్​గ్రాంట్ చెల్లించడంతో చకచకా పనులు
  • మల్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు కంప్లీట్ 
  • హౌసింగ్ బోర్డు కాలనీలో 24/7 తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు పూర్తి 
  • ఈ నెల 24న ప్రారంభించనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కీలకమైన అభివృద్ధి పనులు  పూర్తయ్యాయి. గత సర్కార్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను పూర్తిగా చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో రూ.100 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడంతోపాటు, కేంద్ర ప్రభుత్వం మరో రూ.100 కోట్లు విడుదల చేయడంతో పెండింగ్ పనులన్నీ చకచకా పూర్తవుతున్నాయి. 

గత సర్కార్ తీరుతో పనుల్లో ఆలస్యం

కేంద్ర, రాష్ట్ర - ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.936 కోట్లతో 2017లో కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించారు.  2020 జనవరిలో కొత్త పాలకవర్గం ఎన్నికయ్యేనాటికి పెద్దగా పనులు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద విడుదల చేసిన నిధులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతోపాటు లేటుగా మ్యాచింగ్ గ్రాంట్‌‌తో కలిపి రిలీజ్ చేయడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగేది. 2‌‌‌‌023లోనూ ఇలాగే రూ.10‌‌‌‌0 కోట్లు రిలీజ్ చేయగా, అప్పటి ప్రభుత్వం ఇతర స్కీమ్ లకు మళ్లించింది. నిధుల మళ్లింపుపై పలుమార్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అప్పటి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. 

చకచకా పనులు.. 

స్మార్ట్ సిటీ 2‌‌‌‌024 జూన్ 30తో ముగియగా.. అప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టు గడువును కేంద్రం 2025 మార్చి వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతోపాటు బీఆర్ఎస్ సర్కార్ హయాం నుంచి పెండింగ్‌‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌‌ను త్వరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.232 కోట్లు విడుదల చేసింది. 

నిధులకు కొరత లేకపోవడంతో పనులు చకచకా సాగుతున్నాయి. పెండింగ్ లో ఉన్న మల్టీపర్పస్ పార్క్, అంబేడ్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, బుల్ చమన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్  పనులు, హౌసింగ్ బోర్డు కాలనీలో 24/7 తాగునీటి సరఫరా, ప్రభుత్వ పాఠశాలల్లో  ఇ క్లాస్ రూమ్స్, స్కూళ్ల ఆధునీకరణ పనులు పూర్తి కాగా, కిసాన్ నగర్, కశ్మీర్ గడ్డ మార్కెట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, దోబీ ఘాట్లు, లైబ్రరీ భవనం, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 

24న అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం.. 

మల్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్, ఇ- క్లాస్ రూమ్స్,  స్కూళ్ల ఆధునీకరణ, హౌసింగ్ బోర్డు రిజర్వాయర్ పరిధి 24/7 వాటర్ సప్లై ప్రాజెక్టులను ఈ నెల 24న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్​, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే  స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను పూర్తి చేయగలుతున్నాం. - సునీల్ రావు, కరీంనగర్ మేయర్ 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పనులు స్పీడప్.. 

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పనులు సగంలోనే ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రూ.100 కోట్లకుపైగా మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడంతో పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. మల్టీ పర్పస్ పార్కు పనుల్లో నాణ్యత లోపించింది. పనులపై క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్లు దృష్టి సారించాలి. - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,  సుడా చైర్మన్