న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిందని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన బండి సంజయ్.. రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఇకపై వారానికి 4 రోజులు రైలును నడపాలని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి.. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆది, గురువారాల్లో మాత్రమే నడుస్తున్న ఈ రైలును మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీపై సమీక్షించిన తర్వాత ఏ రోజు రైలును నడపాలనే దానిపై రెండు మూడ్రోజుల్లో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
కరీంనగర్, హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తి చేయండి
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్, హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సంజయ్ కోరారు. వీటితో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్‌లో ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి వెళ్లే గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12590-89), యశ్వంతపూర్ నుంచి గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12592-91 ), హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (12723-23), సికింద్రాబాద్ నుంచి పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (12791-92), చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ (12656-55) రైళ్లను జమ్మికుంట స్టేషన్‌లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.