లంచం కేసులో వీఆర్వోకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ వీఆర్వోగా పనిచేసిన ఇందుర్తి రాంచంద్రారావుపై 2011లో లంచం తీసుకున్న కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు లంచం తీసుకున్నాట్లు నిర్ధారణ కావడంతో నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ.. కరీంనగర్ ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన వీరటి మాధవరెడ్డి నుంచి వీఆర్వో లంచం వసూలు చేశాడు. పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ బుక్ ఇచ్చేందుకు గాను రూ.2వేలు లంచం తీసుకుంటూ నవంబర్ 24, 2011న రామచంద్రం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. ఇక ఈ కేసులో దాదాపు 12 ఏళ్ల తర్వాత నిందితునికి శిక్ష ఖరారైంది.