గడువు దగ్గరపడ్తున్నా పనులు ముందరపడ్తలే !

గడువు దగ్గరపడ్తున్నా  పనులు ముందరపడ్తలే !
  • లక్ష్యానికి దూరంగా కరీంనగర్‌‌‌‌, వరంగల్‌‌‌‌ స్మార్ట్​ సిటీ పనులు

కరీంనగర్/వరంగల్‌‌‌‌, వెలుగు : స్మార్ట్‌‌‌‌ సిటీ ప్రాజెక్ట్‌‌‌‌ గడువు దగ్గర పడుతున్నా కరీంనగర్‌‌‌‌, వరంగల్‌‌‌‌లో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. వాస్తవానికి 2024 జూన్‌‌‌‌ నెలాఖరుతోనే ప్రాజెక్ట్‌‌‌‌ గడువు ముగిసింది. కానీ గడువు పెంచాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించారు. 

ఆ గడువు ముగిసేందుకు కూడా మరో 15 రోజులే ఉన్నాయి. అయినా పనులు మాత్రం ముగియడం లేదు. ప్రస్తుతం పనులు జరుగుతున్న విధానం చూస్తుంటే ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి కాకుంటే బిల్లుల విడుదలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కరీంనగర్‌‌‌‌లో పెండింగ్‌‌‌‌లో ఉన్న పనులివే...

స్మార్ట్‌‌‌‌ సిటీ ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా కరీంనగర్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో రూ.837 కోట్లతో మొత్తం 48 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు, స్ట్రీట్‌‌‌‌లైట్స్‌‌‌‌, సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌, హాకర్స్‌‌‌‌కు షెల్టర్స్‌‌‌‌, పద్మానగర్ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ మార్కెట్, మల్టీ పర్పస్‌‌‌‌ పార్క్‌‌‌‌, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫ్రీ వైఫై, డిజిటల్‌‌‌‌ క్లాస్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ వంటి 33 రకాల పనులను పూర్తి చేశారు. కశ్మీర్‌‌‌‌గడ్డ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌, అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రెనేజీ, లైబ్రరీ బిల్డింగ్, బయోమైనింగ్, కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌, టవర్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ ఆధునికీకరణ, బొమ్మకల్, వన్‌‌‌‌టౌన్‌‌‌‌ పీఎస్‌‌‌‌, సదాశివపల్లి, పద్మానగర్‌‌‌‌ జంక్షన్ల పనులు, ఇంకుడు గుంతలు, ఐసీసీ, డీఆర్ఎఫ్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌, స్కూళ్లలో సౌకర్యాల కల్పన వంటి 14 రకాల పనులు ఇంకా పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. 

కశ్మీర్‌‌‌‌గడ్డ మార్కెట్‌‌‌‌ పనులు పిల్లర్ల దశలో ఉండగా, భూగర్భ డ్రెనేజీ పనులు ఇప్పటివరకు 30 శాతమే పూర్తయ్యాయి. పద్మనగర్, సదాశివపల్లి జంక్షన్ల పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు. బాలసదనం, అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల బిల్డింగ్స్‌‌‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి వదిలేశారు.

టెండర్‌‌‌‌ దశలోనే సాలిడ్ వేస్ట్‌‌‌‌మేనేజ్‌‌‌‌ మెంట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌

టెక్నాలజీని వినియోగం ద్వారా ఏ రోజు చెత్తను అదే రోజు ప్రాసెస్ చేయడం, పొడి, తడి చెత్తను వేరు చేయడం, రీసైక్లింగ్ చేయడం, చెత్త నుంచి కంపోస్టు ఎరువు ఉత్పత్తి చేయడం సాలిడ్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ ప్రధాన లక్ష్యం. రూ.24 కోట్లతో చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టుకు గత నెలలోనే టెండర్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఖరారు కాలేదు. స్మార్ట్‌‌‌‌సిటీ సైన్‌‌‌‌ బోర్డులు ఏర్పాటు చేయలేదు.   

 వరంగల్‌‌‌‌లో 45 పనులు పెండింగ్‌‌‌‌

స్మార్ట్‌‌‌‌ సిటీ స్కీమ్‌‌‌‌లో భాగంగా వరంగల్‌‌‌‌ నగరంలో ఐదేండ్లలో 944.67 కోట్ల ఖర్చుతో 105 పనులను చేపట్టాలని నిర్ణయించారు. స్కీమ్‌‌‌‌ ప్రారంభమైన మొదట్లో కేంద్రం తన వాటా కింద రూ. 200 కోట్లు ఇవ్వగా అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తన వాటా నిధులను కేటాయించలేదు. దీంతో పనులు ముందుకు సాగలేదు. 

స్కీమ్‌‌‌‌ గడువును 9 నెలలు పొడిగించగా.. పనులు పూర్తి చేసేందుకు అదనంగా మరో రూ. 358 కోట్లు అవసరం అవుతాయని నిర్ణయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. రూ.179 కోట్లను సైతం మంజూరు చేసింది. మొత్తం రూ.944.67 కోట్ల విలువైన పనుల్లో ఇప్పటివరకు రూ.427.13 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తికాగా... మరో రూ.517.55 కోట్ల విలువైన పనుల ఇంకా పురోగతిలోనే ఉన్నాయి. 

ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులు

ప్రస్తుతం భద్రకాళి చెరువు బండ్ వద్ద రూ.37.2 కోట్లతో రోడ్డు పనులు, హంటర్‌‌‌‌ రోడ్‌‌‌‌ ఉర్సుగుట్ట వద్ద రూ.15.23 కోట్లు, వడ్డేపల్లి బండ్‌‌‌‌ వద్ద రూ.34.05 కోట్ల అభివృద్ధి పనులు, రూ.27.5 కోట్లతో కరీమాబాద్‌‌‌‌ ఫ్లైఓవర్‌‌‌‌ నుంచి గవిచర్ల రోడ్‌‌‌‌ జంక్షన్‌‌‌‌ వరకు ప్రధాన రోడ్డు, హనుమకొండ రాజాజీ నగర్, వరంగల్‌‌‌‌ పోతన రోడ్‌‌‌‌తో పాటు మరో మూడు చోట్ల రూ.22.6 కోట్లతో నాలాలు, కల్వర్టులు, రూ.25.04 కోట్లతో ప్రెసిడెన్సీ స్కూల్‍ నుంచి నయీంనగర్‍ బ్రిడ్జి వరకు నాలా, రిటైనింగ్‌‌‌‌ వాల్‌‌‌‌, రూ.10 కోట్లతో సిటీలోకి గ్రాండ్ ఎంట్రెన్స్‌‌‌‌ ద్వారం, రూ.46 కోట్లతో ఐదు స్మార్ట్‌‌‌‌ రోడ్లు ఇంప్రూవ్‌‌‌‌మెంట్‌‌‌‌, రూ.36 కోట్లతో రాంపూర్‌‌‌‌ వద్ద బయోమైనింగ్‍ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ పనులన్నీ ఏండ్ల తరబడి కొనసాగుతున్నాయి. 

ఇలాంటి పనులన్నింటినీ పూర్తి చేసేందుకు స్మార్ట్‌‌‌‌ సిటీ స్కీమ్‌‌‌‌ చివరి గడువైన మార్చి 31నే ఆఫీసర్లు సైతం తమ డెడ్‌‌‌‌లైన్‌‌‌‌గా పెట్టుకున్నారు. కానీ ఈ పనులన్నీ మరో 15 రోజుల్లో పూర్తి కావడం కష్టమేనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో 22 ప్రధాన రోడ్ల పనులు చేయాల్సి ఉండగా.. 17 పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి.