చర్చకు రాని దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

  • తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం
  • ఎజెండాలో 31 అంశాలను పెట్టి ఏడింటితో సరిపెట్టిన వైనం 
  • ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు: మంత్రి గంగుల కమలాకర్​

కరీంనగర్, వెలుగు:
కరీంనగర్ జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​మమ అనిపించారు. జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన జనరల్​బాడీ మీటింగ్​కు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా అధికారులు హాజరయ్యారు. 31 అంశాలను ఎజెండాలో చేర్చినప్పటికీ కేవలం ఏడింటితోనే సరిపెట్టారు. వాటిపైనా మొక్కుబడిగానే చర్చించారు. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రూ.3 లక్షల ఆర్థిక సాయం లాంటి అంశాలు సమావేశంలో చర్చకు రాలేదు.  మీటింగ్​ప్రారంభంలో  జమ్మికుంట జడ్పీటీసీ సభ్యుడు డాక్టర్ శ్రీరాంశ్యామ్ మాట్లాడుతూ కుక్క కాటు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే ఇమ్యూనో గ్లోబులిన్స్ ఇంజెక్షన్ ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో మాత్రమే అందుబాటులో ఉందని.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా అందుబాటు ఉంచాలని కోరారు. కొన్నిచోట్ల మిషన్ భగీరథ ఇంట్రా పనులు పూర్తి కాలేదని.. ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్‌‌ మాట్లాడుతూ తోటపల్లి రిజర్వాయర్ కోసం ప్రభుత్వం ఓబులాపూర్ లో 449 ఎకరాల భూమిని సేకరించిందని, రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేసినందున రైతుల భూములు తిరిగి ఇవ్వాలని కోరారు. లేదంటే ఇండ్లు, ఇంటి స్థలాలు తీసుకొని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. దీనిపై మంత్రి గంగుల కమలాకర్​స్పందిస్తూ సేకరించిన భూములు వెనక్కి ఇవ్వడం కుదరదన్నారు.

ఏప్రిల్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోలు....

యాసంగి కొనుగోళ్లకు అధికారులు సిద్ధం కావాలని,  ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని  మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. యాసంగిలో కోటి 50 లక్షల టన్నుల ధాన్యం మార్కెట్ కు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలన్నారు. కౌలు రైతుల పంట కొనే విషయంలో గతంలో ఏర్పడిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఈ సారి 2.71 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, ఈసారి సీడ్ ప్రొడక్షన్ తగ్గి దొడ్డు రకం సాగు పెరిగిందని తెలిపారు. ఆధార్ ఒక చోట, పంట భూములు మరో చోట ఉంటే అమ్ముకునే దగ్గర ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతు, రైసు మిల్లుకు సంబంధం ఉండొద్దని, కొనుగోలు కేంద్రాల వరకే రైతును పరిమితం చేయాలని ఆదేశించారు. తూకంలో కోత విధిస్తున్నారనే మాట రానీయొద్దన్నారు.