కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్..జిల్లా బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ క్రైమ్ డ్రామా

  •     తెలంగాణ నేపథ్యంలో ఫస్ట్ వెబ్ సిరీస్
  •     నటులు, రచయిత, డైరెక్టర్ అంతా కరీంనగర్ వాసులే 
  •     ఇప్పటికే మిలియన్ వ్యూస్  దాటిన కరీంనగర్ వాలే సాంగ్ 

కరీంనగర్, వెలుగు : కరీంనగర్  నేపథ్యంగా తెలంగాణ నుంచి తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ‘కరీంనగర్స్ మోస్ట్  వాంటెడ్’ పేరుతో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన నటులతో పాటు రైటర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్  అంతా కరీంనగర్ వాసులే కావడం విశేషం. ఈ సిరీస్  అంతా కరీంనగర్  లొకేషన్లలోనే షూట్ చేశారు. ప్రత్యేకించి కరీంనగర్  యాసతో రూపొందిన ఈ పొలిటికల్ క్రైం డ్రామా ఆరు ఎపిసోడ్లతో

ఈనెల 22 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫాంలో అలరించనుంది. బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించగా స్ట్రీట్  బీట్జ్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్  ట్రైలర్  వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వెబ్  సిరీస్  కోసం రాహుల్ సిప్లిగంజ్  పాడిన ‘సాలె అప్నే కరీంనగర్ వాలే’ పాటకు యూట్యూబ్ లో వారంలోనే మిలియన్  వ్యూస్  దాటాయి. 

నలుగురు యువకుల జీవితమే

కరీంనగర్‌‌ లో అల్లరి చిల్లరగా తిరుగుతూ సాధారణ జీవితం గడిపే నలుగురు యువకులు ఓ ల్యాండ్  సెటిల్మెంట్ చేసి లైఫ్ లో సెట్ అయిపోదామనుకునే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు, ఓ పొలిటీషియన్  కారణంగా వారు పడిన ఇబ్బందులు, తమకు సంబంధంలేని కేసులో జైలుపాలు కావడం, బయటికొచ్చాక వారు తీసుకున్న నిర్ణయం వారి జీవితాన్ని ఎలా మార్చిందనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారు. కరీంనగర్  సిటీకి చెందిన అమన్ సూరేపల్లి, సాయి సూరేపల్లి, అనిరుధ్  తూకుంట్ల ఇందులో ప్రధాన పాత్ర పోషించారు.

సాయి సూరేపల్లి ఇందులో నటించడంతో పాటు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సంకీర్త్  రాహుల్, రైటర్ గా పనిచేసిన రమేష్ ఎలిగేటి (బలగం సినిమా రైటర్) కూడా కరీంనగర్  జిల్లా వాసులే కావడం విశేషం. ఈ వెబ్ సిరిస్ లో దాదాపు అందరూ కొత్తవాళ్లే  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

50 మంది డ్రామా ఆర్టిస్టులను ఆడిషన్స్  ద్వారా ఈ సిరీస్  కోసం సెలెక్ట్  చేశారు. అందరూ కొత్త యాక్టర్లు అయినా చాలా అనుభవం ఉన్నట్లు అద్భుతంగా నటించారని సినిమాటోగ్రాఫర్ సంకీర్త్  రాహుల్  వెల్లడించాడు. ట్రైలర్ లో వినిపించే డైలాగ్స్ లో నటుల కరీంనగర్  యాస ఆకట్టుకుంది. 

లొకేషన్లన్నీ కరీంనగర్ లోనే..

ఈ వెబ్ సిరీస్ ను మొత్తం కరీంనగర్ లో షూట్ చేశారు. టవర్  సర్కిల్, కమాన్ చౌరస్తా, లోయర్  మానేరు డ్యామ్ అందాలు, కరీంనగర్  జిల్లా జైలుతో పాటు కరీంనగర్ లోని మెయిన్ సెంటర్లన్నీ ఇందులో కనిపించనున్నాయి. ఇవి కరీంనగర్ వాసులను, ఈ సిటీ తెలిసిన వారందరినీ ఎంతగానో ఆకట్టుకోనున్నాయి.

కరీంనగర్ పల్లెల పేర్లతో సినిమాలు

తెలుగు సినిమా తెరపై కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్  జిల్లా ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇప్పటికే జిల్లాలోని మండల కేంద్రం పేరుతో ‘ఓదెల రైల్వేస్టేషన్’  చిత్రం మంచి పేరు తెచ్చుకుంది. ఓదెలకు చెందిన సంపత్  నంది ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. అలాగే బ్యాంకులో జరిగిన చిన్న పొరపాటు ఊరినే మార్చిన కథాంశంతో  వచ్చిన భీమదేవరపల్లి బ్రాంచి సినిమా ఆకట్టుకుంది. ఈ ఏడాది హిట్  మూవీగా నిలిచి అనేక అవార్డులను సొంతం చేసుకున్న బలగం మూవీలో కూడా కరీంనగర్  జిల్లాకు చెందిన డైరెక్టర్  వేణు ఎల్దండి, పలువురు ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటించారు.