
- ములుగు జిల్లా కర్లపల్లి గుండ్లవాగు కాల్వల కోసం 2008లో భూ సేకరణ
- 231 మంది రైతుల నుంచి 82.10 ఎకరాలు తీసుకున్న సర్కార్
- పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
- తెలంగాణ ప్రభుత్వంలోనూ బడ్జెట్ లేదంటూ 4 సార్లు చెక్కులు వాపస్
ములుగు, వెలుగు : పంట కాల్వలకు భూములిచ్చిన రైతులు పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఉమ్మ డి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్ట్‌కు సంబంధించిన పరిహారం పైసలు 15 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివర కు రైతులకు అందలేదు. పాలకులు మారినా, ప్రత్యే క రాష్ట్రం ఏర్పడినా పరిహారం అందకపోవడంతో నిర్వాసితులు ఇప్పటికీ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
231 మంది రైతుల నుంచి 82 ఎకరాల సేకరణ
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి సమీపంలో 2004లో అప్పటి సీఎం వైఎస్‌ఆర్ గుండ్లవాగు ప్రాజెక్ట్‌ను నిర్మించారు. 2006 ఆగస్టు 4న కట్ట తెగిపోవడంతో భూములన్నీ కోతకు గురయ్యాయి. తిరిగి కట్టను నిర్మించిన అనంతరం పంట భూములకు సాగు నీరు అందించడం కోసం ప్రాజెక్ట్‌కు ఇరువైపులా కుడి, ఎడమ కాలువలు నిర్మించాలని 2008లో నిర్ణయించారు. 3 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కుడి కాల్వ 4 కిలోమీటర్లు, ఎడమ కాల్వను 7 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం మొత్తం 231 మంది రైతుల నుంచి 82.10 ఎకరాల భూమిని సేకరించారు. కానీ పనులను పూర్తి చేసిన ప్రభుత్వం, ఆఫీసర్లు నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యం చూపారు.
ప్రపోజల్స్ పంపినా...
2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తమకు పరిహారం చెల్లించాలని నిర్వాసితులు మరోసారి అప్లై చేసుకున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరానికి రూ. 3 లక్షల చొప్పున 82.10 ఎకరాలకు సుమారు రూ. 2.66 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని 2016-–17 సంవత్సరంలో ములుగు సబ్ కలెక్టర్‌గా పనిచేసిన వీపీ.గౌతమ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే పలుమార్లు ఉన్నతాధికులకు చెక్కులు చేరినా బడ్జెడ్ లేదన్న కారణంతో వాటిని తిరిగి పంపిస్తున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన పరిహారాన్ని ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
పరిహారం ఇప్పించాలి
పంట పొలాలకు నీళ్లు ఇచ్చేందుకు కాల్వలు నిర్మిస్తామంటే నాకున్న 2.18 ఎకరాల భూమి ఇచ్చిన. 2008 నుంచి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా పైసలు రావడం లేదు. ఆఫీసర్ల చుట్టూ తిరిగేందుకు మా పైసలే ఖర్చు అవుతున్నాయి తప్ప పరిహారం అందడం లేదు. ఉన్నతాధికారులు, మంత్రులు చొరవ తీసుకొని పరిహారం ఇప్పించాలి.
- లావుడ్య బాషా, భూ నిర్వాసితుడు
పైసలిచ్చి ఆదుకోండి
గుండ్ల వాగు ప్రాజెక్టు కింద సాగు అవుతున్న పంట పొలాలకు నీళ్ల కోసం భూములు ఇస్తే ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. నాకున్న 10 గుంటల భూమిని తీసుకున్నరు. ఉన్న కొంచెం భూమిని కూడా కాల్వ కింద కోల్పోయినం. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
- లకావత్ జుమ్మిలాల్, భూ నిర్వాసితుడు