- ఆ రెండు రాష్ట్రాల ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
- కేసీ కెనాల్‌కు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి
- ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్‌కు నీళ్లెలా తీసుకెళ్తారని నిలదీత
హైదరాబాద్, వెలుగు: తుంగభద్రలో నీటి వాటాలపై కర్ణాటక, ఏపీ కుట్రలను తెలంగాణ తిప్పికొట్టింది. కర్నాటక నావళి రిజర్వాయర్, ఏపీ సమాంతర కాలువలతో తెలంగాణకు తుంగభద్ర జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని, వాటి నిర్మాణం జరగకుండా ఆపాలని తుంగభద్ర బోర్డును డిమాండ్ చేసింది. పైగా బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2) ప్రకారం వాటికి అసలు అవార్డే లేదని, వరద ప్రవాహాల నుంచి నీటిని తీసుకోవడానికి లేదని తేల్చి చెప్పింది. పూడిక పేరు చెప్పి తుంగభద్ర డ్యామ్ ఆధారంగా నావళి వద్ద కర్నాటక ఓ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించతలపెట్టింది.
వరద కాలువ ద్వారా రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇదే కారణాన్ని చూపించి ఏపీ కూడా ప్రాజెక్టు రైట్ బ్యాంక్ హైలెవెల్ కెనాల్‌కు సమాంతరంగా మరో కాలువను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది.ఈ నేపథ్యంలోనే తుంగభద్ర బోర్డు ముందు ఆ రెండు రాష్ట్రాల కుట్రలను తెలంగాణ అధికారులు బట్టబయలు చేశారు. శుక్రవారం హైబ్రిడ్ మోడ్‌లో జరిగిన తుంగభద్ర 222వ బోర్డు మీటింగ్‌లో ఆయా అంశాలపై ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్, ఇంటర్‌స్టేట్ వాటర్ రీసోర్సెస్ ఎస్ఈ ఎస్. విజయ్ కుమార్ తప్పుబట్టారు.
బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2) ప్రకారం వరద ప్రవాహాలను లేదా స్పిల్ వే ద్వారా విడుదల చేసిన నీటిని లేదా నిల్వ చేసిన నీళ్లలో కేటాయించిన దానికి మించి వాడుకునేందుకు లేదని స్పష్టం చేశారు. వారికి పూడికే అడ్డమైతే.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన గైడ్‌లైన్స్‌కు తగ్గట్టుగా ఈ సమస్యకు పరిష్కారం చూసుకోవచ్చని చెప్పారు.
ఇప్పటికే తెలంగాణలోని ఓ ప్రాజెక్టులో పూడికతీతకు సంబంధించి కేంద్రం గైడ్‌లైన్స్‌ను అమలు చేస్తున్నామని బోర్డుకు స్పష్టం చేశారు. పూడికకు సంబంధించి సారమైన మట్టిని రైతులకు ఇవ్వొచ్చని చెప్పారు. పూడికతీతకు సంబంధించిన కేంద్రం గైడ్‌లైన్స్ తమవద్ద ఉన్నాయని, అవసరమైతే ఆ రెండు రాష్ట్రాలకు వాటిని అందజేస్తామని తెలిపారు. తుంగభద్ర ప్రాజెక్టులో ఒక మీటరు మందం మేరకు పూడిక తీస్తే.. ప్రాజెక్టు కోల్పోయిందన్న 31 టీఎంసీల సామర్థ్యాన్ని తీసుకురావొచ్చని స్పష్టం చేశారు.
ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్‌కు నీళ్లా?
ఏపీ కృష్ణా నది నుంచి కేసీ కెనాల్‌కు నీటిని తీసుకుంటున్నదని, కేడబ్ల్యూడీటీ 1 ప్రకారం అది చెల్లదని తెలంగా ణ అధికారులు స్పష్టం చేశారు. తుంగభద్ర నీటిని తర లించాల్సి ఉన్నా.. శ్రీశైలం నుంచి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్‌కు నీళ్లు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. కృష్ణా నీళ్లను తుంగభద్ర ప్రాజెక్టులకు తరలించడమంటే కేడబ్ల్యూడీటీ 1 నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.
ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నుంచి నీటిని తీసుకోవడం ద్వారా.. కేటాయించిన దానికన్నా అధిక జలాలను వాడుకునేందుకు ఏపీ ప్రయత్నాలు చేస్తున్నదని పేర్కొన్నారు. దీని వల్ల శ్రీశైలానికి వచ్చే ఫ్లోస్ కూడా తగ్గిపోతాయని, ఆర్డీఎస్ ఆనకట్టపైనా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా తరలించుకుపోవాలనుకున్న ఏపీ చర్యలను అడ్డుకోవాలని, అందుకు అనుమతించవద్దని బోర్డును కోరారు. కాగా, గేట్లపై నుంచి వరద ప్రవాహం వెళ్లకుండా గేట్ల ఎత్తును పెంచాలన్న ప్రతిపాదనపై స్పందించిన అధికారులు.. 30 సెంటీమీటర్లకు మించి పెంచరాదని, ఫుల్ రిజర్వాయర్ లెవెల్‌ను దాటి స్టోరేజీ లెవెల్‌ను పెట్టరాదని స్పష్టం చేశారు.
తుంగభద్ర నుంచి శ్రీశైలానికి నీళ్లు రావాల్సిందే
కర్నాటక, ఏపీ చేపట్టే ప్రాజెక్టులతో శ్రీశైలానికి తుంగభద్ర నుంచి రావాల్సిన సబ్‌స్టాన్షియల్ కోటా జలాలు రావని అధికారులు బోర్డుకు తెలిపారు. కేడబ్ల్యూడీటీ 1 (బచావత్ ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం తుంగభద్ర జలాలు కృష్ణా బేసిన్‌లోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. తుంగభద్ర డ్యామ్‌లో మోడిఫికేషన్స్ను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూనే ఉన్నామని, దాని వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని స్పష్టం చేశారు.
కర్నాటక నావళి రిజర్వాయర్, ఏపీ సమాంతర కాలువలను అడ్డుకోవాలని బోర్డును కోరారు. దీనిపై ఇప్పటికే బోర్డుకు లేఖ కూడా రాశామని గుర్తు చేశారు. తుంగభద్ర నుంచి తమ వాటాను వాడుకోలేకపోయామన్న కర్నాటక వాదనలో అర్థం లేదని చెప్పారు. కేటాయించిన దానికన్నా తక్కువ నీటిని వాడుకున్నామనడం అవాస్తవమని తెలిపారు. తుంగభద్రకు 2007 నుంచి ఇప్పటివరకూ వచ్చిన వరదలను ఓసారి పరిశీలించాల్సిందిగా బోర్డును కోరారు.