
- క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందన్న మంత్రి దినేశ్ గుండూరావు
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని హోటళ్లలో ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. ఇడ్లీల తయారీకి ప్లాస్టిక్ ఉపయోగించడంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 52 హోటళ్లలో ఇడ్లీలను తయారు చేయడానికి పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తున్నారని కర్నాటక ఆహార భద్రతా విభాగం కనుగొన్నట్టు ఆయన గురువారం తెలిపారు. ఆరోగ్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 250 రకాల ఇడ్లీ నమానాలను పరీక్షించగా, 52 నమూనాల్లో సంప్రదాయ వస్త్రానికి బదులుగా ప్లాస్టిక్ ను ఉపయోగించినట్టు అధికారులు కనుగొన్నారని మంత్రి చెప్పారు.
‘‘అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 251 నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు. గతంలో ఇడ్లీలు తయారీ చేసేటప్పుడు వస్త్రాన్ని ఉపయోగించేవారు. ప్రస్తుతం కొన్ని చోట్ల వస్త్రానికి బదులుగా ప్లాస్టిక్ వాడుతున్నారని మాకు సమాచారం అందింది. కొన్ని నమూనాలను పరిశీలించగా ప్లాస్టిక్ కు పాజిటివ్ గా తేలాయి’’ అని ఆయన మీడియాకు వివరించారు. ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ కారకాలు ఇడ్లీలోకి చేరుతాయని, ఇలాంటి పనులు చేయవద్దని మంత్రి సూచించారు. కర్నాటక ఆరోగ్య శాఖ త్వరలోనే దీనిపై అధికారిక ఆదేశాలు జారీ చేస్తుందని, నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.