కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక మంత్రివర్గం శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ మండిపడింది. కర్ణాటక అభివృద్ధిలో భాగంగా లక్ష కోట్ల అభివృద్ధి పనులకు కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం చేసే కాంట్రాక్టుల్లో 2బీ కేటగిరీ కింద ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందు కోసం.. KTPPA(Karnataka Transparency in Public Procurement Act, 1999) చట్టంలో సవరణ చేసి ముందుకెళుతుండటంపై కర్ణాటక బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించింది. ఇలా కాంట్రాక్టుల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ మండిపడింది. అది కూడా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని కర్ణాటక బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రిజర్వేషన్లలో భాగంగా ముస్లిం కాంట్రాక్టర్లు రూ.2 కోట్ల వరకూ కాంట్రాక్టులను దక్కించుకోవచ్చు.

ALSO READ | మీ హిందీని మా మీద రుద్దకండి..పవన్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్