కర్ణాటక ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల సమయమే మిగిలున్న వేళ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ఉండనున్నదనే అంచనాల మధ్య జాతీయ పార్టీలు రెండూ పైకి ధీమాగానే ఉన్నా లోలోపల మదన పడుతున్నాయి. మే 8 సాయంత్రమే ప్రచార పర్వం ముగియడంతో అంతా సైలెంట్ అయిపోయారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న బజరంగ్దళ్ బ్యాన్ అంశాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో మే 9న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హుబ్బలి విజయ్ నగర్‌లోని హనుమాన్ మందిర్‌లో తన మద్దతుదారులతో కలసి హనుమాన్ చాలీసా పఠించారు. కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనుండగా, 13న ఫలితాలు విడుదల కానున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తరఫున సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర అగ్రనేతలు విస్తృతంగాప్రచారం నిర్వహించారు. పార్టీల భవితవ్యం తేలాలంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే.