Ranji Trophy 2024: రంజీల్లో సంచలనం..గుజరాత్ ధాటికి అనూహ్యంగా కుప్పకూలిన కర్ణాటక

Ranji Trophy 2024: రంజీల్లో సంచలనం..గుజరాత్ ధాటికి అనూహ్యంగా కుప్పకూలిన కర్ణాటక

110 పరుగుల స్వల్ప లక్ష్యం.. స్టార్ బ్యాటర్లతో నిండిన కర్ణాటక ఛేజింగ్.. వికెట్లేమీ కోల్పోకుండా అప్పటికే 50 పరుగులు..మనీష్ పాండే, నీకీ జోస్, మయాంక్ అగర్వాల్, పడికల్ లాంటి బ్యాటర్లు.. మరో 60 పరుగులు చేస్తే విజయం ఖాయం. ఈ దశలో కర్ణాటక ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించరు. కానీ అద్భుతం చోటు చేసుకుంది. గుజరాత్ పై అనూహ్యంగా కుప్పకూలి గెలిచే మ్యాచ్ ను చేజేతులా జారవిడిచారు. దీంతో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న కర్ణాటక.. రంజీ చరిత్రలో చెత్త ఓటమిని మూటకట్టుకుంది. 

110 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 103 పరుగులకు ఆలౌటై ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వికెట్లేమీ కోల్పోకుండా 50 పరుగులు చేసిన కర్ణాటక.. మిగిలిన 10 వికెట్లను 53 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. స్పిన్నర్ సిద్ధార్ద్  దేశాయ్ 7 వికెట్లు తీసి కర్ణాటక వెన్ను విరిచాడు. మరో స్పిన్నర్ వఘాలే 3 వికెట్లతో రాణించాడు. దేవ్ దత్ పడికల్ 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా.. శుభాన్గ్ హెగ్డే 27 పరుగులు చేసి చివర్లో ఒంటరి పోరాటం చేసాడు. కర్ణాటక జట్టులో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.   

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 264 పరుగులకు ఆలౌటైంది. పటేల్ 95 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్ లో 374 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(109) సెంచరీతో సత్తా చాటాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో గుజరాత్ 216 పరుగులు మాత్రమే చేయగా..110 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కర్ణాటక 103 పరుగులకు ఆలౌటై ఆరు పరుగుల తేడాతో ఓడింది.