Zomato: 133 రూపాయల ఫుడ్కు 60 వేలు వదిలించుకున్న జొమాటో.. ఆ ఫుడ్ ఏంటంటే..

బెంగళూరు: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు కర్నాటకలోని కన్స్యూమర్ కోర్ట్ ఊహించని ఝలక్ ఇచ్చింది. 133 రూపాయల ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడంలో జొమాటో ఫెయిల్ అయిందని 60 వేల రూపాయల జరిమానా విధించింది. కర్నాటకకు చెందిన ఒక మహిళకు 2023లో మోమోస్ డెలివరీ చేయడంలో జొమాటో ఫెయిల్ అయింది. సదరు మహిళ జొమాటోపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. విచారణ చేసిన వినియోగదారుల ఫోరం ఎట్టకేలకు జొమాటోదే తప్పని తేల్చి సదరు మహిళకు 60 వేల రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో.. చేసేదేమీలేక జొమాటో సంస్థ ఆ మహిళకు మే, 2024న రిఫండ్ చెల్లించింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నాటకకు ధార్వాడ్ కు చెందిన షీతల్ అనే మహిళ ఆగస్ట్ 31, 2023న జొమాటోలో మోమోస్ ఆర్డర్ చేసింది. అయితే.. ఆమెకు డెలివరీ కన్ఫర్మేషన్ కు సంబంధించి ఎలాంటి సమాచారం జొమాటో నుంచి అందలేదు. ఈ విషయమై జొమాటోతో పాటు ఆమె ఆర్డర్ చేసిన రెస్టారెంట్ ను కూడా షీతల్ సంప్రదించింది. ఈ విషయంలో సమస్య ఎక్కడ తలెత్తిందో గుర్తించడానికి 72 గంటల సమయం కావాలని షీతల్ ను జొమాటో కోరింది. కానీ.. ఆ 72 గంటల సమయం తర్వాత కూడా షీతల్ కు కారణం ఇది అని జొమాటో నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో షీతల్ కు జొమాటో సంస్థ నిర్లక్ష్యంపై చిర్రెత్తుకొచ్చింది.

Also Read:డెలవరీ ఛార్జీలు పెంచిన జొమాటో, స్విగ్గీ : రోజుకు కోటి రూపాయల బాదుడు

సెప్టెంబర్, 2023న జొమాటో సంస్థకు షీతల్ లీగల్ నోటీసులు పంపింది. వినియోగదారుల ఫోరంలో జొమాటో తమ సంస్థది ఎలాంటి తప్పు లేదని వాదించింది. అయితే.. ఈ సమస్యను పరిష్కరించేందుకు తొలుత జొమాటో కోరిన గడువుకు, వినిపించిన వాదనకు పొంతన లేదని వినియోగదారుల ఫోరం గుర్తించింది. జొమాటోదే తప్పని తేల్చి షీతల్ కు పరిహారంగా 50 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఆమె మానసిక ఒత్తిడికి, కోర్టు ఖర్చులకు కారణమైనందుకు మరో 10 వేలు చెల్లించాలని కూడా తీర్పునిచ్చింది. షీతల్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఆర్డర్ చెల్లించకపోగా, ఆ ఆర్డర్ పై ఆమె ఖర్చు చేసిన డబ్బుకు రశీదు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం పేర్కొంది. ఈ కారణంగా.. ఫిర్యాదుదారు అయిన మహిళకు ప్రాథమిక జవాబుదారీగా వ్యవహరించాల్సిన జొమాటో బాధ్యతను విస్మరించిందని కోర్టు భావించింది. అందువల్ల.. జొమాటోకు జరిమానా విధించినట్లు తెలిపింది.