
- ఇంట్లోనే కడుపు, ఛాతీపై కత్తిపోట్లతో మృతి
- భార్య, కూతురిని ప్రశ్నిస్తున్న పోలీసులు
బెంగళూరు: కర్నాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) బెంగళూరులోని తన ఇంట్లో ఆదివారం హత్యకు గురయ్యారు. కత్తిలాంటి పదునైన వస్తువుతో కడుపులో, ఛాతీపై పొడవటంతో తీవ్ర రక్తస్రావమై ఆయన చనిపోయారని పోలీసులు వెల్లడించారు. సంఘటన సమయంలో ఇంట్లో ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు, మరో కుటుంబసభ్యుడు ఉన్నారని.. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.
ఓం ప్రకాశ్ తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడంటూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు కంట్రోల్ రూంకు మరో వ్యక్తి ఫోన్ చేసినట్టు చెప్పారు. మాజీ డీజీపీ, ఆయన భార్య తరచూ గొడవ పడుతుండేవారని విచారణలో తెలిసిందన్నారు. ఈ హత్య ఇంట్లో వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నామని అన్నారు.
ఓం ప్రకాశ్ హత్యపై ఆయన కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆయన డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించామని వెల్లడించారు. కాగా, ఓం ప్రకాశ్ 1981వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2015లో ఆయన కర్నాటక డీజీపీగా పనిచేశారు. అంతకుముందు ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, హోంగార్డ్స్ విభాగాలకు అధిపతిగా విధులు నిర్వర్తించారు.