కొత్త ట్రిబ్యునల్‌కు కర్నాటక నో!
కృష్ణా నీటిలో తమ వాటాకు గండిపడుతుందన్న అనుమానం
త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ
ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రితో మరో మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ
ట్రిబ్యునల్ ను వ్యతిరేకించాలని మహారాష్ట్ర నిర్ణయం!
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్ల పునః పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనను కర్నాటక వ్యతిరేకిస్తోంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలను తెలంగాణ, ఏపీ మధ్య పునః పంపిణీ చేసేందుకే కొత్త ట్రిబ్యునల్ అని కేంద్రం చెప్తున్నా కర్నాటక ససేమిరా అంటోంది. త్వరలోనే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు కర్నాటక వాటర్ రీసోర్సెస్ మంత్రి రమేశ్ జార్కి హౌళి ఇటీవల ప్రకటించారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే అది రెండు రాష్ట్రాలకే పరిమితం కాదని, ఎగువ నుంచి వచ్చే వరదలను కచ్చితంగా లెక్కలోకి తీసుకునే నీటిని పంపిణీ చేయాల్సి ఉంటుందని, అదే జరిగితే తమ రాష్ట్ర కోటాకు గండిపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర సైతం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును వ్యతిరేకించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
రాష్ట్రాల వారీగా కేటాయింపులు..
కృష్ణాలో 75 శాతం డిపెండబులిటీ కింద 2,130 టీఎంసీల నీళ్లున్నట్టుగా గుర్తించి అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు, కర్నాటకకు 734 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయించారు. బ్రజేశ్ ట్రిబ్యునల్ సర్ప్లస్ కోటాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మరో 190 టీఎంసీలు, కర్నాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు ఇంకో 81 టీఎంసీలను కేటాయించింది. అయితే, బ్రజేశ్ ట్రిబ్యునల్ కేటాయింపులు అసంబద్ధంగా ఉన్నాయని, కర్నాటకకు లాభం చేసేలా ట్రిబ్యునల్ వ్యవహరించిందని పేర్కొంటూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో సుప్రీం కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ ట్రిబ్యునల్ అవార్డు కాకుండా ఆగిపోయింది.
4 రాష్ట్రాలకు పంపిణీ చేయాలన్న తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కృష్ణా నీళ్లను నాలుగు రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. కొత్తగా ఏర్పడింది తెలంగాణ కాబట్టి ఉమ్మడి ఏపీ కేటాయింపులను పునః సమీక్షిస్తే సరిపోతుందని ఎగువ రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. అయినా తెలంగాణ ససేమిరా అంది. నాలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సిందేనని పట్టుబట్టింది. నాలుగేళ్ల పాటు ఇదే డిమాండ్ చేసినా నీటి పంపకాలపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో 2018లో తెలంగాణ సర్కారు తన స్టాండ్ మార్చుకుంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్1956లోని సెక్షన్ 3 కింద ఉమ్మడి ఏపీకి చేసిన కేటాయింపులను క్యాచ్మెంట్ ఆధారంగా పునః పంపిణీ చేయాలని ప్రధానికి లేఖ రాసింది. ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే డిమాండ్ చేసింది. నీటి పంపకాలను కోరుతూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటే కొత్త ట్రిబ్యునల్ వేసేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది.
ఉమ్మడి ఏపీకే పరిమితం కాదు
కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే అది కేవలం ఉమ్మడి ఏపీ కేటాయింపులను పునః సమీక్షించేందుకే పరిమితం కాదని కర్నాటక వాదిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, వినియోగం, ప్రవాహాల లెక్కలు లేకుండా కేవలం దిగువ రాష్ట్రాల మధ్యనే నీటిని పంపిణీ చేయడం కుదిరే పనికాదని చెప్తోంది. బ్రజేశ్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాకుండా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి అడ్డుకుందని, ఇప్పుడు పునః పంపిణీ వ్యవహారంలో ఏ ఒక్క రాష్ట్రానికి కేటాయింపుల్లో అన్యాయం జరిగినట్టు అనిపించినా ఆ రాష్ట్రాలు మొత్తం బేసిన్ కేటాయింపులపై పట్టుబడతాయని కర్నాటక వాదిస్తోంది. ట్రిబ్యునల్ సైతం బేసిన్ అలకేషన్‌ను సమీక్షించేందుకు పూనుకుంటే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావిస్తోంది. మహారాష్ట్ర ఇప్పటి వరకు బయటపడకపోయినా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై సమీక్షించినట్టుగా తెలిసింది. కేంద్రం చర్యల ఆధారంగా తమ స్పందన తెలియజేసే ఆలోచనలో మహారాష్ట్ర ఉన్నట్టు సమాచారం.
కర్నాటక లాబీయింగ్
కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఇప్పటికే కేంద్రంలో కర్నాటక లాబీయింగ్ మొదలు పెట్టింది. జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేకంగా భేటీ అయి ట్రిబ్యునల్ ఏర్పాటుపై చర్చించినట్టు తెలిసింది. కర్నాటక వాటాకు ఎలాంటి ఢోకా ఉండదని, కేవలం ఉమ్మడి ఏపీకి చేసిన కేటాయింపులను మాత్రమే పునః సమీక్షిస్తామని జోషికి షెకావత్ హామీ ఇచ్చారు. అయినా కర్నాటక మాత్రం ఆందోళనలోనే ఉంది. తమ రాష్ట్ర అభిప్రాయాన్ని తెలియజేడయంతో పాటు ట్రిబ్యునల్ ఏర్పాటుపై అభ్యంతరాలు చెప్తూ లేఖను త్వరలోనే కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు అందజేయాలని నిర్ణయించింది. కావేరి నదిపై కర్నాటక తలపెట్టిన మెక్‌దాటు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరేందుకు త్వరలోనే కేంద్ర మంత్రిని కలుస్తానని, అదే సమయంలో కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై అభ్యంతరం చెప్తామని కర్నాటక మంత్రి రమేశ్ జార్కి హౌళి చెప్పారు.
For More News..