కర్నాటక ఎన్నికలు రెండు పార్టీలకూ పరీక్షే! : ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

2018 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ మధ్య జరిగిన హోరాహోరీ పోటీలో బీజేపీ104 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌‌‌‌ 80 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోయింది. 37 స్థానాలు సాధించిన జేడీఎస్‌‌‌‌ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ యడియూరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో వారం రోజుల్లో పడిపోయింది. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి జేడీఎస్‌‌‌‌కు మద్దతు ఇవ్వడంతో కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్‌‌‌‌– కాంగ్రెస్‌‌‌‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి తలెత్తి నాటకీయ పరిణామాల మధ్య కుమారస్వామి ప్రభుత్వం 14 నెలల్లో కుప్పకూలడంతో రాష్ట్రంలో యడియూరప్ప ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైంది. సంకీర్ణ ప్రభుత్వంలోని అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ15 స్థానాలకు గాను12 సీట్లు గెలిచి పూర్తి మెజార్టీ సాధించింది. అధికారం చేపట్టాక బీజేపీలో అసమ్మతి పెరగడం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు కరోనా సమయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం బసవరాజు బొమ్మై బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు15 నెలలు పూర్తి చేసుకున్న బొమ్మై ప్రభుత్వం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది.  మరోవైపు వచ్చేసారి అధికారంలోకి తామే వస్తామని ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌‌‌‌ కూడా అసమ్మతి పోరును ఎదుర్కొంటున్నది.

జోడో యాత్ర,  ఖర్గే ప్రభావం 

రాష్ట్రంలో బలమైన కేడర్‌‌‌‌, నాయకత్వం కలిగిఉన్న కాంగ్రెస్‌‌‌‌ పార్టీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందంజలో ఉంది. దీనికి తోడు కర్నాటక కాంగ్రెస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ నేత మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షులు కావడం, రాహుల్‌‌‌‌ గాంధీ చేపట్టిన భారత్‌‌‌‌ జోడో పాదయాత్ర రాష్ట్రంలో దిగ్విజయం కావడం ఆ పార్టీకి సానుకూలాంశాలు. సుదీర్ఘ రాజకీయ అనుభం ఉన్న ఖర్గే 2009 తర్వాతే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాష్ట్రంలోని పార్టీ అధినాయకులు అందరితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. వివిధ సెగ్మంట్లలో పార్టీలో ఐక్యతను కూడగట్టగలరు. ఆయన సామాజిక వర్గమైన దళితులు రాష్ట్రంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే అవకాశాలుంటాయి. జాతీయ అధ్యక్షుడి హోదాలో అభ్యర్థుల టికెట్ల కేటాయింపులో ఆయన ప్రభావం సుస్పష్టంగా ఉంటుంది. జాతీయ అధ్యక్షుడిగా ఆయన తన సొంత రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికార పగ్గాలు చేపడితే జాతీయ రాజకీయాల్లో ఆయన స్థానం మరింత బలోపేతమవుతుంది. కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన రాహుల్‌‌‌‌ పాదయాత్రపై అధికారంలో ఉన్న బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు, స్పందనకు రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ కూడా దీటుగా ప్రతిస్పందించింది. పాదయాత్రతో పార్టీలో నెలకొన్న ఉత్సాహం, ఐక్యతను ఎన్నికల వరకు కొనసాగించడానికి పార్టీ రాష్ట్ర నేతలు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. పార్టీ రాష్ట్ర సీనియర్‌‌‌‌ నేతలు కలిసికట్టుగా ముందుకుసాగుతారా అనేది అన్నిటికన్నా కీలక అంశం.

బొమ్మై బీజేపీని గట్టెకిస్తారా..?

దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎదురుకాని సమస్యను బీజేపీ కర్నాటకలో ఎదుర్కొంటుంది. పార్టీలో ఎన్నడూ లేని విధంగా అనైక్యత, అసమ్మతి, అసంతృప్తి నెలకొన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడూ సొంతంగా పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఆ పార్టీ ఇతర సమీకరణాల మీద ఆధారపడాల్సి వచ్చేది. దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు తరచూ ఆటుపోట్లకు గురవుతూనే ఉండేవి. దాని మాతృ సంస్థలైన సంఘాల నుంచి వచ్చిన నేతలకు, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతల మధ్య ప్రస్తుతం సత్సంబంధాలు లేవు. యడియూరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన తన అనుభవంతో ఇటువంటి సమస్యలను చాలా నైపుణ్యంగా పరిష్కరించేవారు. ఇప్పుడు పార్టీకి ఆ చాకచక్య నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయి. ఇటీవల రాష్ట్రంలో పార్టీ యువనేత హత్య జరగడంతో బొమ్మై ప్రభుత్వం ప్రధానంగా సంఘ్​పరివార్‌‌‌‌ నుంచి విమర్శలు ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సున్నితమైన హిజాబ్‌‌‌‌ సమస్యతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతున్నది. బొమ్మై పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకుల్లో పూర్తి విశ్వాసం పొందలేకపోతున్నారు. మంగళూరులో ఇటీవల జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో సొంత పార్టీ సీఎం అయిన బొమ్మై పేరును ఒక్కసారి కూడా ఎత్తకపోవడం ఇక్కడ గమనార్హం. దీంతో జాతీయ నాయకుల దృష్టిలో బొమ్మై ఇమేజ్‌‌‌‌ పనిచేయడం లేదనే గుసగుసలు పార్టీలో, రాష్ట్రంలో ఊపందుకున్నాయి.  బొమ్మై రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఇప్పటివరకు ఒక ఎజెండాను తయారుచేయలేకపోయారు. ప్రభుత్వ పరంగా బలంగా లేకున్నా పార్టీ పరంగా ఎంతో కొంత పటిష్ట స్థితిలో ఉన్న  ఉత్తరాఖండ్‌‌‌‌, గోవా రాష్ట్రాల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం సొంతంగా రంగంలోకి దిగి ఆయా రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తేగలిగింది. చిన్న రాష్ట్రాలైన ఆ రాష్ట్రాల్లో విజయవంతమైన ఈ ప్రయోగం పెద్ద రాష్ట్రమైన కర్నాటకలో సాధ్యం కాదు. రాష్ట్రంలో బీజేపీలో మొదటి నుంచి అన్నీ తానై ఉండి పార్టీని ముందుకు నడిపించిన యడియూరప్ప సహాయ సహకారాలు కూడా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి చాలా కీలకమే. తనని పదవీచిత్యుడిని చేసిన పార్టీ విజయానికి ఆయన కృషి చేయడం సందేహమే.

రెండు పార్టీలకు కీలకమే..

బీజేపీకి దక్షిణాదిన స్థానం లేదనే వాదనకు బదులుగా ఆ పార్టీ నాయకత్వం కర్నాటకలో అధికారాన్ని  తమ బలంగా చెబుతుంటుంది. ఆ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నా ఎప్పుడూ ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఉంటుంది. తిరిగి పార్టీ అధికారంలోకి రావాలని కేంద్ర బీజేపీ రాష్ట్రంలో యడియూరప్ప స్థానంలో బొమ్మైని ముఖ్యమంత్రిని చేసినా ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటంతో వచ్చే యేడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసమ్మతితో అధికారం మాదే అని ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌‌‌‌లో షరామామూలుగానే వర్గ పోరు ఉంది. రాహుల్‌‌‌‌ భారత్‌‌‌‌ జోడో యాత్ర ఆ పార్టీలో జోష్‌‌‌‌ నింపినా ఆ ఉత్సాహం ఐకమత్యంగా ఎన్నికల వరకు ఉంటుందా వేచి చూడాలి. కాంగ్రెస్‌‌‌‌ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్‌‌‌‌ ఖర్గేకు సొంత రాష్ట్రలో జరిగే ఎన్నికలు పరీక్ష లాంటిదే. విజయం సాధిస్తే జాతీయ స్థాయిలో సానుకూలం లేకపోతే విమర్శలు తప్పవు.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ