Karnataka : బెంగళూరులో సినిమాలకెళ్లే మూవీ లవర్స్కు బ్యాడ్ న్యూస్..

Karnataka : బెంగళూరులో సినిమాలకెళ్లే మూవీ లవర్స్కు బ్యాడ్ న్యూస్..

బెంగళూరు: మూవీ లవర్స్కు కర్నాట ప్రభుత్వం చేదు వార్త చెప్పింది.సినిమా టికెట్లపై, ఓటీటీ సబ్స్క్రిప్షన్లపై 1 నుంచి 2 శాతం సెస్ (పన్ను) అమలు చేయాలని కర్నాటక ప్రభుత్వం యోచన చేస్తోంది. ప్రస్తుత కర్నాటక అసెంబ్లీ సమావేశాల్లోనే కర్నాటక సినీ, కళాకారుల సంక్షేమ చట్టం 2024లో భాగంగా ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సినీ రంగంలోనే కొనసాగుతున్నప్పటికీ గుర్తింపుకు నోచుకోని కళాకారుల సంక్షేమమే లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. సినీ పరిశ్రమపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న గుర్తింపు లేని కళాకారులకు జీవిత బీమా, ప్రమాద బీమా, మెటర్నిటీ లీవ్ అసిస్టెన్స్, ఆర్థిక సాయం, ఆ కళాకారుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ఈ చట్టాన్ని ఆమోదింపజేసుకోవాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది.

ఇందుకు గానూ సినిమా టికెట్లపై, ఓటీటీ సబ్స్క్రిప్షన్లపై 1 నుంచి 2 శాతం సెస్ విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కర్నాటకలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సెస్ విధింపు కర్నాటక ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం మోపాలని చూస్తున్న మరో భారంగా అభివర్ణించింది. పాలు, పెట్రోల్, డీజిల్, బస్ టికెట్ల ధరలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల వినోదంపై పన్ను విధించాలని చూస్తుందని బీజేపీ విమర్శించింది.

ALSO READ | Committee Kurrollu Release: నిహారిక కొత్త సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..కమిటీ కుర్రోళ్ళ జాతర ఆ రోజే

ఇదిలా ఉండగా.. ఈ 1 నుంచి 2 శాతం పన్ను అమల్లోకి వస్తే కర్నాటక రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ధరలు కూడా పెరుగుతాయి. మూడేళ్లకొకసారి సెస్ శాతాన్ని సవరించనున్నట్లు కర్నాటక ప్రభుత్వం పేర్కొంది. సింపుల్ గా చెప్పాలంటే కర్నాటకలో ఈ సెస్ అమల్లోకి వస్తే.. బెంగళూరుతో పాటు కర్నాటకలోని ఏ థియేటర్ లో సినిమాకు వెళ్లినా టికెట్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోల్చితే కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కన్నడ సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపనుందో, థియేటర్కు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులు ఎంతవరకూ ఆమోదిస్తారో చూడాలి. బెంగళూరు నగరంలో తెలుగు సినిమాలు చూసే మనవాళ్లు కూడా చాలామందే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ధరలపై కూడా 1 నుంచి 2 శాతం పన్ను విధించాలని కర్నాటక ప్రభుత్వం భావించడం మూవీ లవర్స్కు కొంత నిరాశ కలిగించే విషయమే.