ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి వల్లే భారీగా కరోనా కేసుల పెరుగుదల

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి వల్లే భారీగా కరోనా కేసుల పెరుగుదల

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా కేసులు భారీగా పెరగడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారే కారణమని అన్నారు ఆ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి కే సుధాకర్. మహారాష్ట్ర లాంటి హాట్ స్పాట్ల నుంచి వస్తున్న వారి వల్లే సిటీలో వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోందని అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా సామూహిక వ్యాప్తి లేదని చెప్పారు. ఒకవేళ కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు వైరస్ వ్యాప్తి చేరి ఉంటే కరోనా కేసుల సంఖ్య లక్షల్లోకి చేరేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరో రెండు నెలల్లో కరోనా వ్యాప్తిని కంట్రోల్‌లోకి తీసుకుని వస్తామని మంత్రి సుధాకర్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 59,652కి చేరగా.. ఒక్క బెంగళూరులోనే బాధితుల సంఖ్య 29,621గా ఉందన్నారాయన. కరోనా లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత పొరుగునున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి ప్రయాణికులు రావడంతో కర్ణాటకలో కొత్తగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయని అన్నారు. బెంగళూరు నగరం కాస్మోపాలిటన్ సిటీ అని, దేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన వారు ఇక్కడ ఉన్నారని, వారు అజాగ్రత్తగా రాకపోకలు జరపడంతోనే వైరస్ వ్యాప్తి ఎక్కువైందని అన్నారు మంత్రి కే సుధాకర్. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇలానే కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారాయన. ప్రజలంతా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తేనే వైరస్ వ్యాప్తి కట్టడి చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం పోలింగ్ బూత్ లెవల్‌లో 8,134 కమిటీలను నియమించామన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా పని చేస్తున్నారని, టెస్టింగ్ కెపాసిటీని కూడా భారీగా పెంచామని చెప్పారు.