IT Employees: బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తున్న ఉద్యోగులకు ఈ విషయం తెలుసో.. లేదో..?!

IT Employees: బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తున్న ఉద్యోగులకు ఈ విషయం తెలుసో.. లేదో..?!

బెంగళూరు: కర్నాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను సవరించాలని కర్నాటక ప్రభుత్వం చేస్తున్న యోచనపై ఐటీ రంగంలోని ఉద్యోగులు భగ్గుమన్నారు. ఈ యాక్ట్లో సవరణలు చేసి ఐటీ ఉద్యోగుల పని గంటలను రోజుకు 12 గంటలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదన చేసింది. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుండటంతో ఐటీ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలిపాయి. ఐటీ ఉద్యోగుల హెల్త్పై, వర్క్ లైఫ్పై ఈ అనాలోచిత నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. అయితే కర్నాటక ప్రభుత్వం వీరి నిరసనను, అభ్యంతరాలను ప్రస్తుతానికైతే పరిగణలోకి తీసుకోలేదు. జులై 19న ఐటీ రంగానికి చెందిన ప్రముఖులతో, ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో, ఐటీ కంపెనీల యాజమాన్యాలతో కర్నాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ సమావేశం నిర్వహించారు. ఐటీ ఉద్యోగులకు రోజుకు 12 గంటల పని వేళల సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

కర్నాటక ప్రభుత్వం ప్రతిపాదించిన ఆ సవరణలో ఏముందంటే..IT/ ITeS/BPO రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రోజుకు 12 గంటలకు పైగా పనిచేసి ఉత్పాదకతను పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కర్నాటక కార్మిక చట్టం ప్రకారం.. పని వేళలు రోజుకు 10 గంటలకు మించి ఉండకూడదు. ఆ పది గంటలు కూడా ఓవర్ టైంతో కలిపి.ఈ 10 గంటలను 12 గంటలు చేయాలని కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ కంపెనీల యాజమాన్యాలతో కలిసి కర్నాటక ప్రభుత్వం ఐటీ ఉద్యోగుల ఆరోగ్యాలతో చెలగాటమాడటం సరైంది కాదని KITU జనరల్ సెక్రటరీ సుహాస్ చెప్పారు. కార్పొరేట్ల లాభాలను పెంచే యంత్రాలుగా ఐటీ ఉద్యోగులను చూస్తూ వాళ్లూ మనుషులనే విషయాన్ని కర్నాటక ప్రభుత్వం మర్చిపోతే ఎలా అని నిలదీశారు.

ఇదిలా ఉండగా.. ఈ సవరణకు సంబంధించిన ప్రతిపాదనపై కర్నాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆ సమావేశంలో అమలు చేస్తే ఎదురయ్యే ఇబ్బందులను, ఆ ఇబ్బందులను అధిగమించడానికి పరిష్కార మార్గాలను అన్వేషించే ఆలోచనలో కర్నాటక ప్రభుత్వం ఉంది. ఇటీవల కర్నాటక ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో, ఉద్యోగుల విషయంలో చేస్తున్న ప్రతిపాదనలు, తీసుకుంటున్న నిర్ణయాలు సరికొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సీఎం సిద్ధరామయ్య సర్కార్ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాపై ప్రైవేట్ కంపెనీల నుంచే పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కర్నాటక ప్రభుత్వం ఆ బిల్లును తాత్కాలికంగా నిలిపివేసింది.