ఎన్నికల తర్వాతే.. కర్నాటకలో అసలు రాజకీయం : మల్లంపల్లి ధూర్జటి

ఎన్నికల తర్వాతే.. కర్నాటకలో అసలు రాజకీయం

కర్నాటకలో మొత్తం ఐదు కోట్ల 21 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 2 కోట్ల 62 లక్షల మంది, మహిళా ఓటర్లు 2 కోట్ల 59 లక్షల మంది ఉన్నారు. ఓటర్లలో18- నుంచి19 ఏండ్ల వయసు వారు 9 కోట్ల 2 లక్షల మంది ఉన్నారు. మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నవారు వీరిలో 41,432 మంది ఉన్నారు. అయితే మే10న పోలింగ్ కేంద్రాలకు వీరిలో ఎంతమంది వెళ్తారో తెలియదు. ఎందుకంటే కర్నాటకలో 2018 ఎన్నికల్లో సగటున 72  శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా బెంగళూరులో 50 శాతం పైచిలుకు మంది మాత్రమే ఓటు వేశారు. పోలింగ్ తేదీ సెలవు రోజులకు ముందైనా, తర్వాతైనా సెలవు రోజులను పొడిగించుకుని ఓటింగ్​నకు డుమ్మాకొడుతున్నారని ఎన్నికల కమిషన్ ఈసారి పోలింగ్ తేదీని బుధవారంగా నిర్ణయించింది. పనిలో పనిగా కర్నాటకలో ఓటర్లుగా నమోదై, విధి నిర్వహణలో భాగంగా పోలింగ్ వార్తలు సేకరించడానికి వెళ్లే  అక్రిడిటెడ్ జర్నలిస్టులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు కల్పించినట్లు కర్నాటక ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా ఇటీవల వెల్లడించారు. 

పార్టీల ప్రచారం

పార్టీలు ఎన్నికల ప్రణాళికలను ఇంకా ప్రకటించకముందే కర్నాటక ఎన్నికలకు సంబంధించి రకరకాల విశ్లేషణలు వెల్లడవుతున్నాయి. అభ్యర్థులు తమ నియోజకవర్గాలకు ఏం చేశారు? ఏం చేయగలరు ? అని కాకుండా వారి పార్టీల సిద్ధాంతాలేమిటి అని కాకుండా అభ్యర్థుల కులం, మతం బట్టి ఎక్కువగా ఓట్లు పడుతున్న పరిస్థితుల్లో గెలుపోటములను ఊహించడం కొంత తేలిక అవుతోంది. వాటి ప్రలోభాలకు, ప్రభావాలకు లోబడని ఓటర్లు కొందరు ఉండకపోరు. వారు ఏ పార్టీవైపు మొగ్గితే ఆ పార్టీ ఎక్కువ సీట్లు సాధించగల అవకాశం ఉంది. ఇంచుమించుగా నలభై ఏండ్లుగా కర్నాటకలో ఏ పార్టీ కూడా ఒక విడత పూర్తయిన వెంటనే రెండోసారి కూడా వెనువెంటనే అధికారానికి వచ్చిన దాఖలాలు లేవు. అంటే, ప్రభుత్వ వ్యతిరేకత అంశం ఏ పార్టీకైనా వర్తిస్తుంది. అలా చూస్తే, ఈసారి కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోలింగ్ నకు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈలోగా నాటకీయ పరిణామాలు ఏవైనా సంభవిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేం. వాటిని బట్టి కాంగ్రెస్ గెలుపు ఖాయమనీ చెప్పవచ్చు లేదా దానికీ అంతగా అవకాశాలు లేవని అనవచ్చు. ఈ ఎన్నికలు బీజేపీ  రాజకీయ న్యాయబద్ధతకు కొలమానం కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా తన ప్రాధాన్యాన్ని చాటుకోవాల్సి ఉంది. ఇక ఈ ఎన్నికలు జేడీ(ఎస్) అస్థిత్వానికే పరీక్షగా నిలవబోతున్నాయి. కనీసం 30 నుంచి-35 సీట్లు గెలుచుకుని కింగ్ మేకర్ గా నిలవాలని దాని తాపత్రయం. ఒంటరిగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బి.జె.పి, కాంగ్రెస్ లు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కర్నాటక సొంత రాష్ట్రం కావడం వల్ల కాంగ్రెస్ విజయానికి ఆయన ఒకింత ఎక్కువగానే శ్రమిస్తారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్ ల మధ్య ఇప్పుడున్న సయోధ్య కూడా కాంగ్రెస్ విజయానికి దోహదపడవచ్చు.

ఆ ప్రాంతాలు కీలకం

మొత్తం224 మంది సభ్యులు గల అసెంబ్లీలో మెజారిటీ సాధించడానికి కాంగ్రెస్ లేదా బీజేపీ 61 సీట్లున్న పాత మైసూరు, కిట్టూరు కర్నాటక, కల్యాణ కర్నాటక ప్రాంతాల్లో మంచి ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ విఫలమైతే బీజేపీ సాధారణ మెజారిటీ సాధించడం కూడా కష్టమవుతుంది. కాంగ్రెస్ విఫలమైతే అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జనతా దళ్(సెక్యులర్) వంటి పార్టీలపై ఆధారపడాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ బలం104కి పరిమితమైంది. కాంగ్రెస్ 75, జేడీ(ఎస్) 28 సీట్లు గెలుచుకున్నాయి. ఏకైక పెద్ద పక్షంగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించినా బల నిరూపణ చేసుకునే దారి లేక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప విశ్వాస తీర్మానం అసెంబ్లీలో ఓటింగ్ కు వచ్చినపుడు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ మద్దతుతో మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కుమారస్వామి గద్దెనెక్కిన14 నెలల లోపే16 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, రెండేండ్లు గడవగానే యడ్యూరప్ప తన పార్టీకే చెందిన బసవరాజ్ బొమ్మైకి ముఖ్యమంత్రి పదవి అప్పగించాల్సి వచ్చింది. బీజేపీ తరఫున గతంలో సదానంద గౌడ, జగదీశ్ షెట్టర్ లు కూడా కొంతకాలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ముఠా కలహాల విషయానికి వస్తే కర్ణాటకలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ లను ఒకే గాటన కట్టవచ్చు. జేడీ(ఎస్) గెలిస్తే కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతారు. ఆయనకూ సోదరుడు రేవణ్ణ నుంచి కొంత ఇంటిపోరు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా కుమారస్వామికే అవకాశాలున్నాయి. జేడి(ఎస్) సంఖ్యా బలం 20 కన్నా తక్కువకు పడిపోతే, బీజేపీ, కాంగ్రెస్ లలో ఏదో ఒక దానికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో  గౌడ వర్గీయులు ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ, బీజేపీ, కాంగ్రెస్ లు ఈసారి తమ ముఖ్యమంత్రుల అభ్యర్థులను ప్రకటించలేదు. నిజానికి, బీజేపీ లింగాయత్ ల మద్దతుపైన, కొంతవరకు వొక్కలిగల అండపైన, ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షక శక్తిపైనే ఆశలు పెట్టుకుంది. మోడీని చూసి ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుంది.

ముస్లింల ప్రభావం 

కర్నాటక జనాభాలో ముస్లింలు దాదాపు13 శాతం మంది ఉంటారు. సుమారు 40 నియోజకవర్గాల్లో వీరు గణనీయమైన ఓటర్లుగా ఉన్నారు. కనీసం 70 నియోజకవర్గాల్లో జయాపజయాల్లో  వీరు కీలక పాత్ర వహించగల స్థితిలో ఉన్నారు. గత(2018) ఎన్నికల్లో బీజేపీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటీ చేయలేదు. కాంగ్రెస్, జేడీ(ఎస్)లు చెరి17 మంది ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దింపాయి. వారిలో కాంగ్రెస్ నుంచి ఏడుగురు అసెంబ్లీకి ఎన్నిక కాగలిగారు. ఉద్యోగాల్లో ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. లింగాయత్ లకు 2 శాతం, వొక్కలిగలకు 2 శాతం రిజర్వేషన్లు పెంచింది. ఆర్థికంగా బలహీనమైన వర్గాలవారికున్న 10 శాతం కోటాలోనే ముస్లింలు ఇకపై తమ వంతు వాటాకు పోటీపడాల్సి ఉంటుంది. ముస్లింల ఓట్లు కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య చీలిపోతే యథాతథ స్థితి ఉంటుంది. ముస్లింలు మూకుమ్మడిగా కాంగ్రెస్ కు ఓటేస్తే దాని విజయం సులభమవుతుంది. కాంగ్రెస్ కు 2018 ఎన్నికల్లో కూడా 38 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి 36 శాతం ఓట్లు లభించాయి. 

కాంగ్రెస్ అడ్వాంటేజ్ 

కాంట్రాక్టులు పొందాలంటే ప్రాజెక్టు విలువలో 40 శాతానికి సమాన మొత్తాన్ని ముడుపులుగా అధికారులకు సమర్పించుకోవాల్సిందేనని కర్నాటకలో కాంట్రాక్టర్ల అసోసియేషన్ బాహాటంగా ఆరోపించింది. ఇటీవల ఒక బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు(లెక్కల్లో చూపించనిది) లభ్యమవడం కూడా ఆ పార్టీకి మరక తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి బసవరాజ్ ను “పే సీఎం” గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో పోస్టర్లు వెలిశాయి. మహిళే పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబాలకు నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ అంటోంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు పది కిలోల బియ్యం, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామంటోంది. డిప్లొమా హోల్డర్లకు రెండేళ్లపాటు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామంటోంది. అన్ని కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితం అంటోంది. ఇవన్నీ ఖజానాకు పెను భారంగా పరిణమిస్తాయని, ఎలా ఆచరణ సాధ్యమవుతాయని బీజేపీ మొత్తుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కర్నాటకలో  మునుపటిలా అసలు రాజకీయాలు మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్