షాక్ : ర్యాపిడో, ఉబర్ బైక్ ట్యాక్సీలను నిషేధించిన హైకోర్టు.. డెడ్‌లైన్ ఫిక్స్..

షాక్ : ర్యాపిడో,  ఉబర్ బైక్ ట్యాక్సీలను నిషేధించిన హైకోర్టు.. డెడ్‌లైన్ ఫిక్స్..

Bike Taxi Ban: చాలా కాలంగా కర్ణాటకలో బైక్ టాక్సీల విషయంలో పెద్ద వివాదం కొనసాగుతోంది. ఒకపక్క ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆర్టీసీలో అనుమతించటంతో ఆటోవాలాలు గిరాకీలు లేక బైక్ టాక్సీ సేవలను అందిస్తున్న వ్యక్తులపై దాడులు కూడా చేసిన ఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆటోవాలలకు అనుకూలంగా పెద్ద వార్త ఒకటి వచ్చింది.

తాజాగా కర్ణాటక హైకోర్టు బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని సంచలన తీర్పును ఇచ్చింది. కర్ణాటకలో రానున్న 6 వారాల్లో వీటిని నిలిపివేయాలని, ప్రభుత్వం నుంచి సరైన నిబంధనలు లేకుండా ఈ సేవలను కొనసాగించొద్దని వెల్లడించింది. కర్ణాటక ప్రభుత్వానికి బైక్ టాక్సీ సేవలను మోటార్ వాహనాల చట్టం 1988 కింద చేర్చటానికి మూడు వారాల గడువును అందిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

వాస్తవానికి తెల్ల నంబర్ ప్లేట్లు కలిగిన టూవీలర్స్ వాణిజ్యపరంగా వినియోగానికి అనుమతి లేదు కాబట్టి..  బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగేటర్ల సేవలను  వ్యతిరేకించింది. అందువల్ల దీనికి సరైన చట్టబద్ధత అవసరమని కోర్టు అభిప్రాయపడింది. టూవీలర్లకు రవాణా వాహనాలుగా గుర్తించటం లేదా వాటికి కాంట్రాక్ట్ క్యారియర్ పర్మిషన్లు ఇచ్చేలా తాము రవాణా శాఖను ఆదేశించలేమని, దీనికి సరైన చట్టం అవసరమని జస్టిస్ బీఎం శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. 

Also Read:-ఇన్వెస్టర్స్ అలర్ట్.. ఇక వీటిలో పెట్టుబడులే లాభదాయకం..

ఈ క్రమంలో కోర్టు తన తాజా ఆదేశాలకు పాటించి, కార్యకలాపాలను నిలిపివేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ట్రాఫిక్, భద్రతపై బైక్ టాక్సీల ప్రభావాన్ని అంచనా వేసిన 2019 నిపుణుల కమిటీ నివేదికను ఈ క్రమంలో కోర్టు ఉదహరించింది. ఈ సేవలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించే ముందు నియంత్రణ స్పష్టత అవసరమని కోర్టు చెప్పింది.

తాజా చర్యలు కర్ణాటకలోని అనేక నగరాల్లో పనిచేస్తున్న ఓలా, ర్యాపిడో, ఉబెర్, నమ్మయాత్రి సహా అనేక బైక్ టాక్సీ అగ్రిగేటర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో బెంగళూరు, మైసూరు, మంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని ప్రజలు రానున్న కాలంలో ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని తెలుస్తోంది.