బెంగళూరు: ప్రజలు సోషల్ మీడియాను వినియోగించేందుకు కనీస వయసును నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి కర్నాటక హైకోర్టు సూచించింది. పిల్లలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని జస్టిస్ జి.నరేంద్ర, జస్టిస్ విజయ్‌కుమార్ పాటిల్‌తో కూడిన బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని యూఆర్ఎల్ లను బ్యాన్ చేయాలని కేంద్రం జారీ చేసిన ఆర్డర్‌లపై ఎక్స్(ట్విట్టర్) హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ ను కోర్టు మంగళవారం విచారించింది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ..కొన్ని ఆన్‌లైన్ గేమ్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారుల నుంచి ఆధార్, ఇతర పత్రాలను తీసుకోవాలని చట్టం చెబుతోందని తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. అలాంటి గుర్తింపును సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎందుకు అడగటం లేదని ప్రశ్నించింది.
ప్రస్తుతం చాలా మంది స్కూల్ పిల్లలు సోషల్ మీడియాకు బానిసలుగా మారారని తెలిపింది. సోషల్ మీడియాలోని ఓ కంటెంట్ చూసిన 17 లేదా 18 ఏండ్ల పిల్లలకు.. అది దేశ ప్రయోజనాలకు సంబంధించినదా కాదా అని నిర్ధారించే పరిపక్వత ఉంటుందా అని నిలదీసింది. ఇంటర్నెట్‌లోని పలు విషయాలు కూడా చిన్నారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పింది. దీన్ని నివారించే చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. మద్యం తాగడానికి చట్టబద్ధమైన వయస్సును నిర్ణయించినట్లే సోషల్ మీడియాను ఉపయోగించడానికి కూడా ఏజ్ లిమిట్ పెడితే బాగుంటుందని సూచించింది. జాతీయ భద్రత విషయంలో అందరూ ఒకే మాటపై నిలవాలని పేర్కొంది. కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.