
బెంగళూరు: 'బెంగళూరు వంటి పెద్ద సిటీల్లో మహిళలపై లైగింక వేధింపులు కామనే' అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కర్నాటక హోం మినిస్టర్ జి.పరమేశ్వర మంగళవారం స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటలను వక్రీకరించారని వెల్లడించారు. తన కామెంట్ల వల్ల మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఒక ప్రకటనలో కోరారు.
"నా కామెంట్లను సరిగా అర్థం చేసుకోలేదు. హోం మంత్రిగా మహిళల భద్రతకు నేను కట్టుబడి ఉన్నాను. మహిళల రక్షణ కోసం నిర్భయ నిధులను సమర్థవంతంగా ఉపయోగించాను. ఇలాంటి అనేక చర్యలు ఎన్నో తీసుకున్నాను. లైంగిక వేధింపులపై నేను చేసిన కామెంట్లకు మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి క్షమించండి" అని పరమేశ్వర విజ్ఞప్తి చేశారు.