కేరళలో నిఫా కేసులతో కర్నాటక అలర్ట్

  • కేరళలో నిఫా కేసులతో కర్నాటక అలర్ట్
  • బార్డర్ జిల్లాల్లో ఫీవర్ సర్వైలెన్స్ పాయింట్లు ఏర్పాటు 
  • అవసరముంటే తప్ప కేరళకు వెళ్లొద్దని ప్రజలకు సూచన

బెంగళూర్ :  కేరళలో నిఫా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పక్కనున్న కర్నాటక అలర్ట్ అయింది. అవసరమైతే తప్ప కేరళకు వెళ్లొద్దని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ బార్డర్​లోని జిల్లాల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం గైడ్ లైన్స్ విడుదల చేసింది. అన్ని జిల్లాల్లో సర్వైలెన్స్ చేపట్టాలని అందులో పేర్కొంది.

కేరళ బార్డర్​లోని చామరాజనగర, మైసూరు, కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఎంట్రీ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు పెట్టి ఫీవర్ సర్వైలెన్స్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అనుమానిత కేసులు నమోదైతే, వెంటనే బాధితులను క్వారంటైన్ చేసేందుకు ఆస్పత్రులు సిద్ధం చేయాలని తెలిపింది. పీహెచ్​సీ లెవల్ నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. 

ALSO READ: మనోహరాబాద్ కొత్తపల్లి రూట్​లో.. ట్రయల్ రన్ విజయవంతం

కేరళలో ఆరుకు పెరిగిన కేసులు.. 

కేరళలో నిఫా వైరస్ కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. 39 ఏండ్ల వ్యక్తికి శుక్రవారం పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. నిఫాతో చనిపోయిన వ్యక్తి నుంచి వైరస్ సోకిందని చెప్పారు. వైరస్​తో ఇప్పటికే ఇద్దరు చనిపోగా, నలుగురు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని అన్నారు.

‘‘ఆగస్టు 30న నిఫాతో చనిపోయిన వ్యక్తి నుంచే బాధితులందరికీ వైరస్ సోకిందని అనుమానిస్తున్నాం. అందుకే హైరిస్క్ లిస్టులో ఉన్నోళ్లందరికీ మొబైల్ ల్యాబ్స్​తో పాటు కోజికోడ్ ల్యాబ్​లో టెస్టులు చేస్తున్నాం” అని తెలిపారు. కాగా, నిఫా బాధితులకు ట్రీట్​మెంట్ అందించేందుకు ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీ డోసులను దిగుమతి చేసుకోనున్నట్టు ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బహల్ తెలిపారు.