వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్,ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది. భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తూ పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. వ్యాక్సిన్ వేసుకోని వారు పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. క్లబ్‌లు, పబ్‌లలో డీజేలు, ప్రత్యేక ఈవెంట్ లకు పర్మిషన్ ఇవ్వలేదు. పబ్ ల్లో ప్రవేశం 50 శాతం సామర్థ్యానికి పరిమితం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా పెద్ద ఎత్తున పార్టీలను అనుమతించడం లేదని సృష్టం చేసింది.
అపార్ట్‌మెంట్లలో డీజేలు ఉపయోగించకుండా నిషేధం విధించింది. అంతర్గత ప్రదేశాల్లో 50శాతం సామర్థ్యంతో వేడుకలకు అనుమతినిచ్చింది. మంగళవారం అధికారులు, కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎం బసవరాజ్ బొమ్మై ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని నిషేధిస్తున్నట్లు బసవరాజు బొమ్మై తెలిపారు. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సృష్టం చేశారు.