బెంగళూరు/ముంబై: కొన్నేండ్లుగా కర్నాటక, మహారాష్ట్ర మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. బెళగావిలో మహారాష్ట్ర నంబర్ ప్లేట్‌తో ఉన్న లారీలపై ‘కర్నాటక రక్షణ వేదిక’ కార్యకర్తలు బ్లాక్ ఇంక్ పోశారు. ఓ లారీ గ్లాస్ కూడా పగులగొట్టారు. 1960లో రాష్ట్రాల పార్టీషన్ సరిగ్గా జరగలేదంటూ ‘కర్నాటక రక్షణ వేదిక’ ఆందోళనలు చేస్తున్నది. అందులో భాగంగానే మంగళవారం వందలాది మంది కార్యకర్తలు కర్నాటక జెండాలు పట్టుకుని ధార్వాడ్ నుంచి బెళగావి వెళ్లి నిరసన చేపట్టారు. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు తీసింది. దీంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు బార్డర్స్ తో పాటు దగ్గర్లోని విలేజెస్లో భారీగా పోలీసులను మోహరించాయి. కర్నాటక రక్షణ వేదిక కార్యకర్తలు బెళగావి హైవేపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కర్నాటక సీఎం బస్వరాజ్బొమ్మైతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫోన్లో మాట్లాడారు. రాళ్లదాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఫడ్నవిస్‌కు బొమ్మై హామీ ఇచ్చారు.
కర్నాటక బస్సులపై ‘జై మహారాష్ట్ర’ పెయింట్
బెళగావి దాడిని ఖండిస్తూ పుణె సిటీలో శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. కర్నాటక బస్సులపై బ్లాక్, ఆరెంజ్ పెయింట్‌తో ‘జై మహారాష్ట్ర’ అని రాశారు. కర్నాటకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెళగావి దాడికి నిరసనగానే కర్నాటక బస్సులపై ‘జై మహారాష్ట్ర’ రాశామన్నారు.
2 రాష్ట్రాల మధ్య ఇదీ వివాదం
1960లో లాంగ్వేజ్ ఆధారంగా మరాఠీ మెజారిటీ ఏరియాను కర్నాటకకు అప్పజెప్పారని మహారాష్ట్ర వాదిస్తున్నది. దీనిపై సుప్రీంకు కూడా వెళ్లింది. మహారాష్ట్రలో తమ గ్రామాలు కొన్ని ఉన్నాయని కర్నాటక వాదిస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల గొడవలు మొదలయ్యాయి. తాజాగా ఈ వివాదం ముదిరింది. వారం కింద బెళగావిలోని ఓ కాలేజీ ప్రోగ్రాంలో ఓ విద్యార్థి కర్నాటక జెండా ప్రదర్శించడంతో మరాఠీ విద్యార్థులు అతడిపై దాడి చేశారు.