![కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్లో ఉద్రిక్తత.. 300 మందితో ‘మహా’ నిరసన](https://static.v6velugu.com/uploads/2022/12/Karnataka-Maharashtra-border-row-Massive-protest-at-Belagavi-for-no-to-maha-mela-sec-144-imposed_KStQz6jkxq.jpg)
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడింది. బెళగావిలో ‘మహా మేళా’ సభ నిర్వహణకు కర్ణాటక సర్కారు అనుమతి ఇవ్వకపోవడంపై మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆగ్రహం వ్యక్తం చేశాయి. వాటికి చెందిన దాదాపు 300 మంది కార్యకర్తలు కర్ణాటక రాష్ట్రం బెళగావి సరిహద్దులోని కగ్నోలి టోల్ ప్లాజా వద్ద నిరసనకు దిగారు. దీంతో బెళగావి ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజున ఏటా బెళగావిలో మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి మహా మేళా సభ నిర్వహిస్తుంటుంది. ఆ సంస్థ గత ఐదేళ్లుగా ఈ ఆందోళనలు కొనసాగిస్తోంది. అయితే ఈసారి మహా మేళా నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతివ్వలేదు. అయినా ఇవాళ మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి , ఎన్సీపీ కార్యకర్తలు బెళగావి జిల్లా సరిహద్దులోని కగ్నోలి టోల్ ప్లాజా వద్దకు వందలాదిగా చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
కర్ణాటక సీఎం బొమ్మై వ్యాఖ్యలపై దుమారం
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్కల్ కోట్ తహసీల్ పరిధిలోని 11 గ్రామాల ప్రజలు తమకు సరైన ప్రాథమిక సౌకర్యాలు లేవని.. ఊళ్లను కర్ణాటక ప్రాంతంలో కలపాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ఇటీవల ప్రస్తావించడంతో కర్ణాటక, మహారాష్ట్రల మధ్య వివాదం మొదలైంది. ఈనేపథ్యంలోమహారాష్ట్రలోని పూణేలో కర్ణాటక నెంబర్ ప్లేట్ తో వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఆపి శివసేన వర్గం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అనంతరం కర్ణాటకలోని బెళగావిలో మహారాష్ట్రకు చెందిన లారీపై ఆందోళనకారులు దాడి చేశారు. ఈనేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు డిసెంబరు 14న సమావేశమయ్యారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని అమిత్ షా తెలిపారు. శాంతిభద్రతల సమస్యను పరిశీలించడానికి సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలో కమిటీని వేస్తామన్నారు. తద్వారా రెండు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు, వ్యాపారులకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేసే వారిపై.. పోలీసు కేసులు నమోదు చేస్తామని షా ఆ రోజున స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరూ మాట్లాడొద్దన్నారు. ఇందుకు కాంగ్రెస్, ఉద్దవ్ థాక్రే వర్గం సహకరించాలని అమిత్ షా కోరారు.