భీమదేవరపల్లి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగానే తమ నేతల ఇండ్లలో ఐటీ, ఈడీతో తనిఖీలు చేయిస్తున్నదని కర్నాటక మంత్రి బి.నాగేంద్ర, హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి, ముత్తారం, కొప్పూరు, కొత్తపల్లి, ములుకనూరు గ్రామాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో నాగేంద్ర మాట్లాడారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రాగానే కర్నాటక తరహాలో ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో స్త్రీ సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలను అందంగా ప్రచారం చేస్తారని, వీలైతే కర్నాటకకు వస్తే కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపిస్తామని పేర్కొన్నారు.
తమ రాష్ట్రానికి వచ్చే దమ్ము బీఆర్ఎస్ లీడర్లకు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసి కోట్లాది తెలంగాణ ప్రజల ఆశాలను , ఆశయాలను తప్పకుండా నెరవెరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టోఫర్ తిలక్, అసెంబ్లీ ఇన్ చార్జి గోపీనాథ్ పణని అప్పన్, పీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, భీమదేవరపల్లి మండల అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి పాల్గొన్నారు.
అద్దెకు తీసుకొచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నరు
బెజ్జంకి వెలుగు : కర్నాటక రైతులను బీఆర్ఎస్ నేతలు తెలంగాణకు అద్దెకు తీసుకువచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారని కర్నాటక పర్యాటక శాఖ మంత్రి నాగేంద్ర అన్నారు. మంగళవారం రాత్రి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కర్నాటక రాష్ట్రంలో ఉచితంగా కరెంటు ఇవ్వడం లేదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం లేదని బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కర్నాటక ఎమ్మెల్యే బసవన్న గౌడ్ మాట్లాడుతూ తమ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఎంపీటీసీ సమతా మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.