టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీకి జాతీయ అవార్డు రద్దు చేయడాన్ని కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు సమర్థించారు. జానీకి అవార్డు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం మంచి పనిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గౌరవించడం సరికాదన్నారు. 17 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలతో పోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న యడియూరప్ప విషయంలో కేంద్రం ఇంతే కఠిన వైఖరిని ఎందుకు పాటించడం లేదని ఆయన ప్రశ్నించారు.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని లైంగికంగా వేధించిన కేసులో కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తమిళ్లో ధనుష్ నటించిన ‘తిరుచిత్రంబలం’ సినిమాలోని పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు జానీకి నేషనల్ అవార్డు దక్కింది. అయితే రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకునేలోపే లైంగిక వేధింపుల కేసు జానీకి ఈ అరుదైన అవకాశాన్ని దూరం చేసింది.
జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఓ యువతి జానీపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ తనను మైనర్గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా లోబర్చుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీసులు పోక్సో కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
లైంగిక వేధింపుల కేసులో జానీ ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో అతనికి ప్రకటించిన జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో.. నేషనల్ అవార్డు అందుకోవడానికి బెయిల్పై బయటికొచ్చినప్పటికీ జానీకి నిరాశే మిగిలింది. అతని బెయిల్ కూడా రద్దయింది. జానీకి జాతీయ అవార్డును రద్దు చేయడంపై సినీ పరిశ్రమ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
జానీకి జాతీయ అవార్డును రద్దు చేయడాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు సెలబ్రెటీలు మాత్రం పెదవి విరిచారు. జానీ స్వశక్తితో కష్టపడి పైకొచ్చాడని, ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని అతని కష్టానికి దక్కాల్సిన జాతీయ అవార్డును రద్దు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు.