చెట్టును ఢీకొన్న కారు.. కర్ణాటక మహిళా మంత్రికి తీవ్ర గాయాలు

చెట్టును ఢీకొన్న కారు.. కర్ణాటక మహిళా మంత్రికి తీవ్ర గాయాలు

కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం (జనవరి 14) తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా అంబద్‌గట్టి సమీపంలో కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో హెబ్బాల్కర్ సోదరుడు, కర్ణాటక శాసనమండలి సభ్యుడు చెన్నరాజు కూడా కారులో ఉన్నారు. ప్రమాదంలో మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్, ఆమె సోదరుడు ఇద్దరూ గాయపడ్డారు. లక్ష్మీ హెబ్బాల్కర్ వీపు, ముఖంపై గాయాలవ్వగా.. MLC చెన్నరాజు తలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

బెంగళూరు to బెల్గావి

సోమవారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశానికి హాజరైన అనంతరం హెబ్బాల్కర్ బెంగళూరు నుంచి తిరిగి బెల్గావి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో కిత్తూరు సమీపంలో ఆమె కారు వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ కుక్క కారు ముందుకి రావడంతో డ్రైవర్ కుక్కను తప్పించేందుకు వాహనాన్ని పక్కకు తిప్పడంతో స్టీరింగ్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్‌లన్నీ తెరుచుకోవడంతో మంత్రి, ఆమె సోదరుడు గాయాలతో బయటపడ్డారు.