
బెంగుళూరు: ఐటీ రాజధాని బెంగుళూరులో ఇటీవల ఓ యువతి లైంగిక వేధింపులకు గురైంది. రాత్రి వేళ సుద్దగుంటెపాల్యలోని భారతి లేఅవుట్‌లోని ఓ వీధి గుండా నడుచుకుంటూ వెళ్తుండగా ఫాలో అయిన ఓ దుండగుడు యువతిని లైంగికంగా వేధించాడు. యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు వేసి అభస్యకరంగా ప్రవర్తించాడు. యువతి ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025, ఏప్రిల్ 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ ఘటనపై స్పందించిన కర్నాటక హోం మంత్రి జి. పరమేశ్వర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
సోమవారం (ఏప్రిల్ 7) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో అలాంటి ఘటనలు తరుచుగా అక్కడకక్కడ జరుగుతుంటాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే.. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే.. బీట్ పెట్రోలింగ్ పెంచాలని పోలీసులను ఆదేశించానని పేర్కొన్నారు. ఓ యువతి లైంగిక వేధింపులకు గురైతే.. సాక్ష్యాత్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి అలాంటి ఘటనలు కామన్ అన్నట్లుగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
►ALSO READ | వీడు మామూలోడు కాదు... అత్తింటికే కన్నం వేసిన అల్లుడు..
హోం మినిస్టర్ వ్యాఖ్యలతో మహిళల్లో అభద్రతాభావం మరింత పెరిగిపోతుందని మహిళ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష బీజేపీ కూడా హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యలపై భగ్గుమంది. అయితే.. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు ఈ ఇష్యూను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెక్షన్ 354B కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.