మైసూరులో ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో పది మంది మృతి

మైసూరులో ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో పది మంది మృతి

బెంగళూరు: కర్నాటకలో ఘోర ప్రమాదం జరిగింది. కంట్రోల్ తప్పిన ఇన్నోవా కారు వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన పదిమంది స్పాట్​లోనే చనిపోయారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో మైసూరు ట్రిప్ కు బయలుదేరింది. పిల్లాపాపలతో కలిసి వెళుతుండగా కుర్పూర్ దగ్గర్లో ఇన్నోవా అదుపుతప్పింది. మూల మలుపులో కారు వేగం అదుపులోకి రాలేదు.. దీంతో ఇన్నోవా వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న బస్సును బలంగా ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు మొత్తం నుజ్జునుజ్జుగా మారింది. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీయడం చాలా కష్టమైందని స్థానికులు తెలిపారు. ఇన్నోవాలో ప్రాణాలతో ఉన్న ఓ ప్రయాణికుడిని అతికష్టమ్మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ప్రమాదం తప్పినట్లేనని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు కూడా తీవ్రంగా దెబ్బతింది. అయితే, ప్రయాణికులకు ఎవరికైనా గాయాలయ్యాయా లేదా అనే విషయం తెలియరాలేదు. రోడ్డు ప్రమాదంలో పదిమంది చనిపోవడంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం పేర్కొన్నారు.