- ఇయ్యాల జూరాలకు చేరే అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణ తాగునీటి అవసరాల కోసం కర్నాటక సర్కార్ వాటర్‌ను రిలీజ్ చేసింది. 1.9 టీఎంసీల నీటిని నారాయణపూర్ డ్యామ్ నుంచి కర్నాటక ఇరిగేషన్ అధికారులు బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్నాటక ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ పలుమార్లు కోరింది.
సీఎస్ శాంతి కుమారి, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పలుమార్లు ఆ రాష్ట్ర అధికారులతో భేటీ అయ్యి నీటి విడుదలకు విజ్ఞప్తి చేశారు. వారం కింద నాగర్‌కర్నూల్ సీఈ విజయ్ భాస్కర్ రెడ్డి నేతృత్వంలో అధికారులు కర్నాటక ఆఫీసర్లకు వినతిపత్రం ఇచ్చి వచ్చారు. తాజాగా కర్నాటక అధికారులు నీళ్లను విడుదల చేశారు. గురువారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు నీళ్లు చేరుకుంటాయని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువగా ఉంది. కర్నాటక నుంచి వచ్చే జలాలతో వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.