నల్లగొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. వర్షాన్ని లెక్కచేయకుండా ప్రజలతో మమేకం అవుతూ నేతలు ముందుకు సాగిపోతున్నారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ను పార్టీ కార్యక్రమాలకు పిలవకపోయినా మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో సమాచారం ఇవ్వకపోవడం నియోజకవర్గ బాధ్యుల విచక్షణకు వదిలేస్తున్నామని కర్నె ప్రభాకర్ అన్నారు. తాను కేసీఆర్ సైనికుడినని..ఎవరు పిలిచినా పిలవకపోయినా ముఖ్యమంత్రి కోసం పనిచేస్తానన్నారు. మునుగోడు టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ఆశావాహులు పది మంది ఉన్నారని.. వారిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కచ్చితంగా వారి తరపున పని చేస్తానని తెలిపారు.
కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది చేస్తానని చెప్పారు. ఇక్కడ ఉన్న పెద్దలు పిలవడం లేదని తాను అలిగి ఇంట్లో కూర్చోనన్నారు. మునుగోడు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో తనకు పిలుపు లేదని చెప్పకనే చెప్పుకొచ్చారు కర్నె ప్రభాకర్. ప్రచారంలో భాగంగా బీసీ జాతీయ అధ్యక్షుడుగా నియమితులైన జాజుల శ్రీనివాస్ గౌడ్ ను మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సన్మానించారు.