బిష్ణోయ్‌ని కాల్చి చంపండి.. కోటి రూపాయలు ఇస్తా..: కర్ణి సేన చీఫ్

బిష్ణోయ్‌ని కాల్చి చంపండి.. కోటి రూపాయలు ఇస్తా..:  కర్ణి సేన చీఫ్

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన పోలీసు అధికారికి క్షత్రియ కర్ణి సేన భారీ రివార్డు ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌లో బిష్ణోయ్ ముఠా సభ్యులచే కాల్చి చంపబడిన ప్రముఖ రాజ్‌పుత్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి మరణానికి ప్రతీకారంగా క్షత్రియ కర్ణి సేన నాయకుడు రాజ్ షెకావత్ ఈ రివార్డ్ ప్రకటించారు.

బిష్ణోయ్ దేశానికి ముప్పు అని పేర్కొన్న కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షెకావత్.. అతని హతమార్చిన ఏ పోలీసు అధికారికైనా కోటి పదకొండు లక్షల పదకొండు వేల రూపాయలు(రూ.1,11,11,111/) రివార్డు ఇస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. కర్ణి సేన చీఫ్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో లారెన్స్ బిష్ణోయ్‌ని చంపిన పోలీసు అధికారికి రూ.1,11,11,111 రివార్డు ఇస్తామని తెలిపారు.

పట్టపగలు కాల్చి చంపారు.. 

గతేడాది డిసెంబర్ 5న లో కర్ణి సేన మాజీ చీఫ్, రాజ్‌పుత్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి జైపూర్ లోని తన నివాసంలో టీ తాగుతుండగా గుర్తుతెలియని దుండగులచే కాల్చి చంపబడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో షూటర్లలో ఒకరైన నవీన్ సింగ్ షెకావత్ కూడా మరణించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది తామేనని ప్రకటించింది.

జైలులో ఉంటూనే హత్యలు, బెదిరింపులు

డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. అక్కడి నుంచే అతను తన ముఠాను నడిపిస్తున్నాడు. ఈ మధ్యనే బిష్ణోయ్ గ్యాంగ్ మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ను కాల్చి చంపారు. అంతేకాదు, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‍ను చంపేస్తామని బెదిరిస్తున్నారు.