
- తెలంగాణ–చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల భారీ కూంబింగ్
- మడవి హిడ్మా దళం టార్గెట్‌గా గాలింపు
- రంగంలోకి 2 వేల మంది పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్
- మంగళవారం ఉదయం నుంచి కొనసాగిన ఎన్‌కౌంటర్
- పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం
- బేద్రేలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మిలీషియా కమాండర్ మృతి
జయశంకర్ భూపాలపల్లి/వెంకటాపురం/భద్రాచలం, వెలుగు: తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రె గుట్టలు కాల్పులతో హోరెత్తాయి. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు భారీ కూంబింగ్ నిర్వహించాయి. 2 వేలకు మందికి పైగా పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తో గుట్టలను చుట్టుముట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగగా, పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తున్నది.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ముఖ్య నేత హిడ్మా దళం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ములుగు జిల్లా వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలాలను ఆనుకొని.. చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సరిహద్దుకు దగ్గరలో కర్రె గుట్టలున్నాయి. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో సీఆర్‌పీఎఫ్ బలగాలు కొద్ది నెలలుగా మావోయిస్టుల ఏరివేత చేపట్టాయి. వరుస ఎన్‌కౌంటర్లలో వందల మంది మావోయిస్టులు మరణించారు.
మిగిలినవారు రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్రె గుట్టలవైపు వచ్చినట్టు పోలీస్ నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ గుట్టల చుట్టూ బాంబులు, ల్యాండ్‌మైన్స్ అమర్చి సేఫ్ జోన్‌గా మార్చుకున్నట్టు తెలుసుకున్నారు. ఈ గుట్టలపైకి ఎవరూ రావద్దంటూ, బాంబులు పెట్టామని మావోయిస్టు పార్టీ వెంకటాపురం డివిజిన్ కార్యదర్శి శాంత పేరుతో కొద్ది రోజుల క్రితం ఒక లేఖ కూడా విడుదలైంది. మావోయిస్టుల ప్రకటనపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అడవులపై ఆధారపడి జీవించే తమను గుట్టలపైకి రావద్దనడం సరికాదంటూ గిరిజన గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టి.. ర్యాలీలు తీశారు.అయితే .. అది ఫేక్ లెటర్ అని, మావోయిస్టు పార్టీ నేతలు అలాంటి లెటర్లు రిలీజ్ చేయరని పౌరహక్కుల నేతలు ప్రకటించారు.
ఉదయం నుంచే ఎన్‌కౌంటర్
మంగళవారం అటు చత్తీస్‌గఢ్.. ఇటు తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలను సీఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. కర్రె గుట్టలపైకి వెళ్లేందుకు సీఆర్‌పీఎఫ్ బలగాలు సోమవారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చేరుకున్నాయి. భారీ వెహికల్స్‌లలో కర్రె గుట్టలపైకి వెళ్లిన వేలాది మంది పోలీసులు వెళ్లగా.. మావోయిస్టులు ఎదురుపడడంతో మంగళవారం ఉదయం నుంచే కాల్పులు కొనసాగుతున్నట్టు గిరిజనులు చెబుతున్నారు.
దీంతో తెలంగాణ రాష్ట్రం వైపు గుట్ట పైనఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల, జెల్ల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కర్రె గుట్టకు దగ్గరలోఉన్న పెనుగోలు, కొంగాల, అరుణాచలపురం, బొల్లారం, పెంక వాగు, మల్లాపురం, కదైవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో హై టెన్షన్ నెలకొంది. ఈ గ్రామాల నుంచి పోలీసులు కూంబింగ్ ప్రారంభించారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం
ఆపరేషన్ హిడ్మా?
దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చత్తీస్ గఢ్‌లో ‘ఆపరేషన్ కగార్’ పేరుతో భద్రతా బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి, రోడ్లు నిర్మించాయి. బ్యాకప్ పార్టీలు ఏర్పాటు చేసుకొని, వరుసగా ఎన్‌కౌంటర్లు చేయడంతో వందలాది మంది మావోయిస్టులు చనిపోయారు.
కేంద్ర బలగాల దాడుల నుంచి తప్పించుకున్న మావోయిస్టు కీలకనేత మడవి హిడ్మా నేతృత్వంలోని దళం.. కర్రె గుట్టలపైకి మకాం మార్చినట్టు సీఆర్‌పీఎఫ్ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. హిడ్మాతో పాటు అతడి దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు మంగళవారం ఉదయం రెండు వైపుల నుంచి కర్రె గుట్టలపై కాల్పులు ప్రారంభించారు. బాంబు స్క్వాడ్‌లు, హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో ముందుకు కదులుతున్నారు.
ఎన్‌కౌంటర్‌లో మిలీషియా కమాండర్ మృతి
చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్జిల్లా బేద్రే పోలీస్‌స్టేషన్‌పరిధిలోని కెర్పే- తోడ్సంపార అడవుల్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జనమిలీషియా కమాండర్ మృతిచెందారు. అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో నుగురు బేస్‌క్యాంపునకు చెందిన సీఏఎఫ్(చత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్) బలగాలు కూంబింగ్నిర్వహించాయి. జనమిలీషియా దళం మీటింగ్ నిర్వహిస్తుండగా బలగాలు చుట్టుముట్టాయి.
గుండిపూరి జనమిలీషియా కమాండర్వెల్లా వాచం ఆధ్వర్యంలో మావోయిస్టులు కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో వెల్లా వాచం మృతి చెందారు. అతడిపై రూ.3 లక్షల రివార్డు ఉంది. ఇటీవల అంబేలీలో డీఆర్జీ బలగాల వ్యాన్‌ను ఐఈడీతో పేల్చిన ఘటనకు వెల్లా వాచం సూత్రధారి అని బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్రయాదవ్ తెలిపారు. ఘటనాస్థలం నుంచి 315 రైఫిల్స్‌తోపాటు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు సీజ్ చేసినట్టు చెప్పారు.