వేములవాడ ఆలయంలో నవంబర్​ 2 నుంచి కార్తీకం పూజలు

 వేములవాడ ఆలయంలో నవంబర్​ 2 నుంచి కార్తీకం పూజలు
  • డిసెంబర్‌‌‌‌ 1 వరకు ప్రత్యేక పూజలు
  • సోమవారం భక్తులతో కిటకిటలాడిన రాజన్న ఆలయం


వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నవంబర్‌‌‌‌ 2 నుంచి కార్తీక మాస వేడుకలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌‌‌‌ 1 వరకు జరిగే వేడుకల్లో ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకాలు, లింగార్చన, కార్తీక మహా పురాణ ప్రవచనములు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నవంబర్ 13న రుక్మిణీ విఠలేశ్వరస్వామికి పంచోపనిషత్‌‌‌‌ ద్వారా అభిషేకం, సాయంత్రం శ్రీకృష్ణతులసీ కల్యాణం జరపనున్నారు.

14న వైకుంఠ చతుర్ధశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి పంచోపనిషత్‌‌‌‌ అభిషేకం, శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహాపూజ, పొన్న చెట్టు సేవ అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించనున్నారు. 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రదోషకాల పూజ, రాత్రి జ్వాలాతోరణం జరపనున్నారు. రాత్రి నిశిపూజ అనంతరం శ్రీరాజరాజేశ్వర స్వామికి మహాపూజ నిర్వహించనున్నారు. అలాగే రాజన్న ఆలయ కల్యాణ మండపంలో నెల రోజుల పాటు కార్తీక పురాణ ప్రవచనం నిర్వహిస్తారు. 

రాజన్న సన్నిధిలో భక్తుల సందడి

వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడెలను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఒక్కరోజే 49,355 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.