శంషాబాద్, వెలుగు: మంత్రి సబితారెడ్డి కొడుకు, బీఆర్ఎస్ లీడర్ పటోళ్ల కార్తీక్‌రెడ్డిపై అదే పార్టీ రాజేంద్రనగర్ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మైలార్ దేవ్ పల్లి దుర్గానగర్ చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు సార్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా గెలిచానని, సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు.
ఎవరు ఎన్ని మాటలు చెప్పినా రాజేంద్రనగర్ టికెట్ తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కూడా గతంలో సిట్టింగులకే తిరిగి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని ప్రకాశ్గౌడ్గుర్తుచేశారు. ‘చేతగాని మాటలు మాట్లాడడం కాదు.. దమ్ము, ధైర్యం ఉంటే టికెట్ తెచ్చుకొని మాట్లాడాలని’ కార్తీక్ రెడ్డికి సవాల్ విసిరారు.
కాగా సోమవారం మహేశ్వరంలో కార్తీక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నుంచి సబితారెడ్డి పోటీ చేస్తే.. రాజేంద్రనగర్ నుంచి తాను పోటీ చేస్తానని.. ఈ ఒక్క సీటును తనకు కేటాయించాలని’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ప్రకాశ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.