కార్తీక మాసం సోమవారం ( నవంబర్ 20) రానే వచ్చింది. ఈ మాసం శివుడికి, కేశవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కావడంతో ఈ మాసంలో భక్తులు విశేషంగా ఆలయాలను సందర్శిస్తారు. కార్తీకమాసం నెల రోజుల కాలం ఉపవాసం చేసి అత్యంత భక్తి, శ్రద్ధలతో భగవన్నామ స్మరణతో గడుపుతారు. అయితే కార్తీక మాస వ్రతాన్ని ఆచరించదలచిన వారు ముఖ్యంగా కార్తీక సోమవారాలలో చేయవలసిన విధి విధానాలను కార్తీక పురాణంలో వివరించారు. కార్తీక సోమవారం నాడు ఆరు పద్ధతులలో, ఏదో ఒక పద్ధతిలో అయినా కార్తీక సోమవార వ్రతాన్ని చేస్తే పుణ్యం దొరుకుతుందని, సద్గతులు ప్రాప్తిస్తాయని వశిష్ట మహర్షి వివరించారు. ఇక ఆ ఆరు పద్ధతులను గురించి ఈరోజు తెలుసుకుందాం .
కార్తీక వ్రతం చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాల ఫలం
జనక మహారాజుకు వశిష్టుడు కార్తీక మాస మహత్యాన్ని వివరిస్తూ కార్తీక మాసంలో శివునికి అత్యంత ఇష్టమైన సోమవార వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని, వారికి ముక్తి లభిస్తుందని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజు అయినా స్నాన, జపాదులను ఆచరించినా వారు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారని వశిష్ట మహర్షి తెలిపారు.
మొదటిది ఉపవాసం
కార్తీక సోమవార వ్రత విధానాన్ని ఆచరించే ఆరు పద్ధతుల విషయానికి వస్తే అవి ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము అని వశిష్ట మహర్షి తెలిపారు. ఇక వీటి వివరాల్లోకి వెళితే శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు రోజంతా భోజనం చేయకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు. దీనిని ఉపవాస దీక్ష అంటారని వశిష్ఠ మహర్షి తెలిపారు.
మధ్యాహ్నం భుజించి రాత్రి తినకుండా భక్తితో ఉండటం
ఇక ఏమీ తినకుండా కార్తీక సోమవార దీక్ష చేయడం సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నాన, దాన, జపాలు యధావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలని వశిష్ఠుడు తెలిపారు. దీనిని ఏక భుక్తము అని, ఒక పూట భోజనం చేసి భగవంతుని మీద మనసును లగ్నం చేసి నిష్టగా పూజించాలని తెలిపారు.
పగలంతా ఉపవాసం చేసి రాత్రి భుజించటం
ఇక మరొక విధానంలో పగలంతా ఉపవాసం చేసి, ఏమీ తినకుండా రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనానికి గాని ఉపహారాన్ని గానీ తీసుకోవడాన్ని నక్తము అంటారు అని వశిష్ఠుడు తెలిపారు. అంటే పూర్తిగా ఆహారం లేకుండా దీక్ష చేయడం, ఒక పూట మధ్యాహ్న సమయంలో భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా వ్రతాన్ని చేయడం, రోజంతా తినకుండా రాత్రి సమయంలో భోజనం చేయడం ద్వారా కార్తీకమాస సోమవార వ్రతాన్ని చెయ్యొచ్చని సూచించారు.
కార్తీక సోమవార వ్రతానికి ఈ పనులు చేసినా చాలు
ఇక మరొక విధానంలో భోజనానికి తాము ప్రయత్నం చేయకుండా, ఎవరైనా భోజనం పెడితే ఆ భోజనాన్ని మాత్రమే చేయడాన్ని అయాచితము అంటారు. ఈ విధానంలో కూడా కార్తీక సోమవార వ్రతాన్ని చేయవచ్చని వశిష్ఠుడు తెలిపారు. ఇక ఉపవాసానికి శక్తిలేని వారు స్నాన, జపాదులు చేసినప్పటికీ సరిపోతుందని అన్నారు. ఇక మంత్ర విధులు కూడా రాని వారు, స్నాన, జపాదులు తెలియనివారు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుందని వశిష్టుడు జనకుడికి తెలిపారు. కార్తీక సోమవారం నాడు నిష్ఠగా ఈ ఆరు పద్ధతులలో దేనిని ఆచరించినా వారు ఖచ్చితంగా కైవల్యాన్ని పొందుతారు అని, శివసాయుజ్యం లభిస్తుందని వశిష్టుడు జనకమహారాజుకు బోధించారు. అందుకే అప్పటి నుండి కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నారు