- ధర్మదర్శనానికి 4, స్పెషల్ దర్శనానికి గంటన్నరకు పైగా టైం
- ఆదివారం రికార్డు స్థాయిలో 1,256 సత్యనారాయణ స్వామి వ్రతాలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీకమాసానికి తోడు ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రధానాలయ ప్రాంగణం, క్యూ లైన్లు, శివాలయం, లక్ష్మీ, విష్ణు పుష్కరిణులు, పాతగుట్ట, వ్రతమండపాలు కిక్కిరిసిపోయాయి. రద్దీ కారణంగా స్వామి వారి ధర్మ దర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నరకు పైగా టైం పట్టిందని భక్తులు తెలిపారు.
భక్తులకు చెందిన వాహనాలతో పార్కింగ్ ప్లేస్ నిండిపోవడంతో, మిగతా వాహనాలను హెలీ ప్యాడ్, వాహన పూజల ప్రాంగణానికి తరలించారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించుకొని కార్తీక దీపాలు వెలిగించారు. యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివకేశవులకు రుద్రాభిషేకం, లక్ష బిళ్వార్చన నిర్వహించారు.
ఒక్కరోజే 1,256 సత్యనారాయణస్వామి వ్రతాలు
అన్నవరం తర్వాత యాదగిరిగుట్టలోనే అత్యధికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతుంటాయి. ఆదివారం ఒక్కరోజే 1,256 మంది దంపతులు వ్రత పూజలు జరిపించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వ్రతాల నిర్వహణ ద్వారా ఆలయానికి రూ.10,04,800 ఆదాయం వచ్చింది. ఇక ఆదివారం భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.64,26,176 రాబడి వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.