ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భజే వాయువేగం. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించగా.. రధాన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటి? ఎలా ఉంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
వెంకట్ (కార్తికేయ) అనాథ. అప్పుల బాధతో చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు. వెంకట్ ని తన తండ్రి స్నేహితుడు (తనికెళ్లి భరణి) దత్తత తీసుకుంటాడు. అప్పటికే ఆయనకి ఒక కొడుకు ఉంటారు. పేరు వెంకట్ (రాహుల్ టైసన్). అలా ఇద్దరినీ పెంచి పెద్ద చేస్తాడు తణికెళ్లభరణి. పెద్దయ్యాక సిటీకి వచ్చిన ఇద్దరూ.. జాబ్ చేస్తున్నామని తండ్రికి అబద్దాలు చెప్తారు. ఓ రోజు తండ్రికి ఆరోగ్యం విషమించడంతో.. డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, అక్కడి గ్యాంగ్ మోసం చేస్తారు. ఆ తరువాత ఎం జరిగింది? వెంకట్ ఆ డబ్బు ఎలా సంపాదించాడు? ఈ కథకి డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహిత్స్వ)కి ఉన్న సంబంధమేంటి? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ:
భజే వాయువేగం ఒక గురించి చెప్పాలంటే ఇదొక క్రైం థ్రిల్లర్ మూవీ. బెట్టింగ్స్ వేస్తూ డబ్బు సంపాదించే ఒక వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న కొన్ని అనూహ్య సంఘటనలు, వాటి నుండి అతను ఎలా బయటపడ్డాడు అనే కథే ఈ భజే వాయువేగం. కథ పాతదే అయినప్పటికీ దాని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, అతని గతం గురించి చెప్పడానికి సరిపోయింది. మధ్యలో హీరోయిన్ ట్రాక్ రోటీన్ గా ఉంది ఆడియన్స్ కి పరీక్షలా మారింది. మళ్ళీ ఇంటర్వెల్ కి వచ్చేసరికి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ పరుగులు పెడుతుంది. ట్విస్టులు, చేసులు, యాక్షన్ సీన్స్.. అలా చివరి వరకు ఎంగేజింగ్ గానే సాగుతుంది. మళ్ళీ క్లైమాక్స్ రొటీన్ గా సెట్ చేశారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
హీరో కార్తికేయ ఈ సినిమా కోసం తన కెరీర్ బెస్ట్ ఇచ్చాడు. తన కటౌట్ కి తగ్గ పాత్ర పడింది. వెంకట్ పాత్రను చాలా ఈజ్ తో చేశాడు. అన్ని రాకాల ఎమోషన్స్ ని పండించాడు. ఇక హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కు పెద్దగా స్కోప్ ఎం లేదు. ఉన్నంతలో బాగా చేసింది. ఇక హీరోతో ఈక్వల్ గా ఉన్న పాత్రలో రాహుల్ కనిపించాడు. చాలా రోజుల తరువాత తనకి మంచి పాత్ర పడింది. ఇక మిగిలినవారు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
భజే వాయువేగం సినిమాకి ప్రధాన బలం మ్యూజిక్. రధాన్ అందించిన పాటలకన్నా.. బీజీఎమ్ చాలా బాగుంది. కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమా మూడ్ ను బాగా క్యారీ చేసింది. ఇక దర్శకుడు ప్రశాంత్ తొలి సినిమా అయినా బాగా ప్రెజెంట్ చేశాడు. తాను అనుకుకున్నదాన్ని క్లియర్ గా స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు.
మొత్తంగా చెప్పాలంటే భజే వాయువేగం మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నచ్చుతాయి.