Vijay Hazare Trophy: ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు: టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు

భారత్ తరపున టెస్టులో ట్రిపుల్ సెంచరీ ఒక్కసారిగా అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు కరుణ్ నాయర్. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సరికొత్త చరిత్ర నెలకొల్పాడు.  2016లో ఇంగ్లండ్‌తో జరిగిన తన తొలి సిరీస్‌లోనే కరుణ్ ఈ ఘనతను సాధించడం విశేషం. చెన్నై వేదికగా జరిగిన ఈ టెస్టులో 381 బంతుల్లో 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ట్రిపుల్ సెంచరీ తర్వాత కరుణ్ నాయర్ తన పేలవ ఫామ్ తో భారత జట్టులో కొనసాగలేకపోయాడు. 2017లో భారత్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన నాలుగు ఇన్నింగ్స్ ల్లో నిరాశపరిచాడు. దీంతో భారత జట్టులో స్థానం కోల్పోయాడు. పేలవ ఫామ్ తో భారత జట్టులో స్థానం కోల్పోయిన ఈ కర్ణాటక ప్లేయర్.. మళ్ళీ భారత క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో నాయర్ దంచికొడుతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా సెంచరీలు లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. ఈ టోర్నీలో చివరి ఆరు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 5 సెంచరీలు బాది టీమిండియా సెలక్టర్లకు సవాలు విసిరాడు. 

చివరి ఆరు ఇన్నింగ్స్ ల్లో కేవలం ఒక్కసారే అవుట్ కావడం విశేషం. అతని యావరేజ్ 664 ఉండడం విశేషం. కరుణ్ నాయర్ ఫామ్ భారత సెలక్టర్లను ఆకట్టుకుందని సమాచారం. అతడిని త్వరలో టీమిండియా టెస్ట్ జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రహానే, పుజారా లేకపోవడంతో టెస్టుల్లో టీమిండియాకు మిడిల్ ఆర్డర్ లో బలహీనంగా కనిపిస్తుంది. దీంతో కరుణ్ నాయర్ భారత టెస్ట్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

2024 ఆగస్టు లో మహారాజా టీ20 ట్రోఫీలో భాగంగా కరుణ్ నాయర్ 43 బంతుల్లోనే సెంచరీ చేసిన తర్వాత ఇలా మాట్లాడాడు.. "దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఇప్పుడు నా ఏకైక లక్ష్యం. మళ్ళీ భారత టెస్ట్ క్రికెట్ జట్టులోకి రావాలని ఆశిస్తున్నా. కష్టపడి భారత జట్టులో స్థానం సంపాదిస్తాననే నమ్మకం నాకుంది. నేను గత ఏడాది కాలంలో అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని సవాలుగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను". అని ట్రిపుల్ సెంచరీ వీరుడు తెలిపాడు.