- కారుణ్య నియామక అభ్యర్థుల నిరసన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నా ఉద్యోగాలు రాక కుటుంబాలను పోషించుకోలేక పోతున్నామని, వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కారుణ్య నియామక అభ్యర్థులు కోరారు. ఈ విషయమై సోమవారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ఎదుట నిరసన తెలిపారు. జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌తో పాటు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడ్పీ పరిధిలో పనిచేస్తూ విధి నిర్వహణలో మృతి చెందిన వారికి ప్రభుత్వం కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. జడ్పీ పరిధిలో 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 11 మంది మాత్రమే అభ్యర్థులున్నా కారుణ్య నియామకాల్లో భాగంగా భర్తీ చేయడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు లేకపోవడంతో ఏండ్ల తరబడి కుటుంబాలను పోషించుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికైనా తమకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ ప్రోగ్రాంలో అభ్యర్థులు దీపిక, రోహిణి, వసంత, స్రవంతి, సాయి ప్రసాద్, జయంత్, షాదాబ్ పాల్గొన్నారు.