యాదవ భవన కూల్చివేతపై ఉద్రిక్తత .. కార్వాన్​లో ఆందోళన

మెహిదీపట్నం వెలుగు: కార్వాన్ యాదవ సంఘం నిర్మాణంలో ఉన్న  భవనాన్ని తహశీల్దార్ అక్రమంగా  కూల్చి వేశారని సంఘం సభ్యులు సోమవారం ఆందోళన చేపట్టారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి టప్పాచబుత్రా పీఎస్​కు తరలించారు. దీంతో  పోలీస్ స్టేషన్ ఎదుట కార్వాన్ యాదవ సంఘం ప్రతినిధులతో పాటు బీసీ కుల ప్రతినిధులు ఆందోళనకు దిగారు.

1998లో  545 గజాలను శ్రీ కృష్ణ యాదవ్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని యాదవ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.  ముందస్తు సమాచారం లేకుండా ఆసిఫ్ నగర్ తహశీల్దార్ అక్రమంగా కూల్చివేశారని, కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోలేదని, ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  తమ స్థలంలోని నిర్మాణాన్ని కూల్చడం ఎంతవరకు సమంజసమని యాదవ సంఘం అధ్యక్షుడు బోడి అశోక్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.  ఆసిఫ్ నగర్ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యోతిని నెల రోజుల కిందట కలిసి స్థలానికి చెందిన అన్ని ఆధారాలు చూపామని, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఆకస్మాత్తుగా వచ్చి  నిర్మాణాన్ని కూల్చడం వెనక ఉన్న మతలబేంటో చెప్పాలని  డిమాండ్ చేశారు.

Also Read : బ్యాడ్మింటన్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్ఫోసిస్ జట్టు

న్యాయం జరిగే వరకు పోరాడతామని, బాధ్యులైన అధికారులను కోర్టు ముందు నిలబెడతామన్నారు.  కార్వాన్ కార్పొరేటర్ స్వామి యాదవ్, జియాగూడ కార్పొరేటర్ బోయిని దర్శన్ తో పాటు గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉప్కెల పాండు యాదవ్, బీజేపీ నేతలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  కాగా అది ప్రభుత్వ స్థలమని అందుకే కూల్చి వేశామని ఆసిఫ్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తహశీల్దార్ వివరణ ఇచ్చారు.