- రేపు, ఎల్లుండి బాధిత ప్రాంతాల్లో 9 బృందాల పర్యటన
హైదరాబాద్, వెలుగు: మూసీ బాధితులకు అండగా ఈ నెల25న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నెల 23, 24 తేదీల్లో మూసీ పరీవాహక ప్రాంతాల బాధితులను బీజేపీ బృందాలు పరామర్శిస్తాయని, ఇందుకోసం మొత్తం 9 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి టీంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు సహా నలుగురు సభ్యులు ఉంటారని తెలిపారు.
ఆయా టీంలు 18 ప్రాంతాల్లో పర్యటిస్తాయన్నారు. రాజేంద్ర నగర్ లో కిషన్ రెడ్డి, పాయల్ శంకర్, దుగ్యాల ప్రదీప్, తోకల శ్రీనివాస్ రెడ్డి టీం, కార్వాన్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ధర్మపురి అర్వింద్, ధర్మా రావు, అమర్ సింగ్ టీం పర్యటిస్తాయని ఆయన తెలిపారు. ఢిల్లీకి కప్పం కట్టడానికి రేవంత్ రెడ్డి నెలకొక ఎత్తుగడ వేస్తున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను పక్కన బెట్టి హైడ్రా, ఫోర్త్ సిటీ, మూసీ వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని వెంకటేశ్వర్లు ఆరోపించారు. ముఖ్యమంత్రికి మూసీ చరిత్రే తెలియదని, మూసీకి ఏసుప్రభువుకు సంబంధం ఏమిటో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.