టీడీపీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాసానికి కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి అహ్వానించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సి ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. పార్టీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదు ముమ్మరం చేయడంతోపాటు  ప్రజా సమస్యలపై పోరాటాలకు శ్రీకారం చుట్టాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

కాసాని జ్ఞానేశ్వర్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ కాసాని  పనిచేశారు.