త్వరలో టీడీపీ బస్సు యాత్ర

  • అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్‌ చేసేలా రూట్ మ్యాప్ 
  • సక్సెస్ చేయాలని​ క్యాడర్​కు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 5 వేల కిలోమీటర్ల బస్సు యాత్ర నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా చేపడుతున్న ఈ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం  ఎన్టీఆర్ భవన్​లో ఖమ్మం, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. బస్సు యాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైందన్నారు.

ఎక్కడెక్కడ కార్నర్ మీటింగ్స్, సభలు నిర్వహించాలన్నది షెడ్యూల్ రూపొందిస్తామన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగురవేసి సత్తా చాటాలని కాసాని సూచించారు. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెంచి వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు బస్సు యాత్రకు సిద్ధం కావాలని ఖమ్మం, జహీరాబాద్ పార్లమెంటు నాయకులకు సూచించారు.