మస్క్ ఆదేశాలను పట్టించుకోవద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు FBI డైరెక్టర్ కాష్ పటేల్ సూచన

మస్క్ ఆదేశాలను పట్టించుకోవద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు FBI డైరెక్టర్ కాష్ పటేల్ సూచన

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఎలాన్ మస్క్ ఇచ్చిన జస్టిఫై యువర్ జాబ్ ఆదేశాలను పట్టించుకోవద్దని ఆ దేశ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ తన ఉద్యోగులకు సూచించారు. ఎఫ్​బీఐకి సొంత విధానాలున్నాయని, ఆ ప్రకారంగానే తన ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తుందని పేర్కొన్నారు. 

‘సమాచారం కోరుతూ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్​మెంట్(ఓపీఎం)​నుంచి ఎఫ్​బీఐ సిబ్బందికి వచ్చిన మెయిల్​గురించి పట్టించుకోవద్దు. ఎఫ్​బీఐ రూల్స్‎కు అనుగుణంగా డైరెక్టర్ కార్యాలయం సమీక్షలు నిర్వహిస్తుంది. బాధ్యత వహిస్తుంది. మీ నుంచి మరింత సమాచారం అవసరమైతే ఎఫ్‎బీఐనే కోరుతుంది. ఇతరుల ఆదేశాలను నిలిపివేయండి” అని కాష్ పటేల్ ఎఫ్​బీఐ ఉద్యోగులందరికీ ఆదివారం మెయిల్ చేశారు. 

కాగా, ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్న మస్క్.. ఎఫ్బీఐ ఉద్యోగులందరికీ శనివారం ఓ అల్టిమేటం జారీ చేశారు. ఉద్యోగులంతా గతవారం చేసిన పనేంటో 5 వాక్యాల్లో వివరించాలని సూచించారు. సోమవారం అర్ధరాత్రిలోగా రిప్లయ్ ఇవ్వనివాళ్లను రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తామని ఓపీఎం నుంచి మెయిల్ పంపారు. ఓపీఎం నుంచి వచ్చిన ఈ మెయిల్‎కు రెస్పాండ్ కావొద్దని కాష్ పటేల్ సూచించారు.