స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా పాలించిన ప్రాంతాలను బ్రిటిష్ ఇండియా అని, స్వదేశీ రాజు పాలనలోని ప్రాంతాలను స్వదేశీ సంస్థానాలు అనేవారు. 1947 నాటికి 562 సంస్థానాలు ఉండేవి. ఇందులో 559 సంస్థానాలు భారత్‌లో కానీ పాకిస్తాన్లో కానీ విలీనం కాగా, మిగిలిన జునాగఢ్, కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్నాయి. వీటిని భారతదేశంలో విలీనం చేసేందు కేంద్ర ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపట్టింది. ప్రజాభిప్రాయ సేకరణతో జునాగఢ్ విలీనం కాగా, సైనిక చర్యతో కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు భారతదేశ నియంత్రణలోకి వచ్చాయి.
కశ్మీర్: 1846లో జరిగిన లాహోర్ సంధి ప్రకారం సిక్కులు మొదటి ఆంగ్లో – సిక్కు యుద్ధానికి నష్టపరిహారంగా బ్రిటిష్ వారికి కశ్మీర్‌ను ధారాదత్తం చేశారు. ఆ తర్వాత మహారాజా గులాబ్‌సింగ్ బ్రిటిష్ వారి నుంచి కశ్మీర్‌ను కొనుగోలు చేశాడు. 1941 బ్రిటిష్ జనాభా సెన్సెస్ ప్రకారం కశ్మీర్లో ముస్లిం జనాభా 77%, హిందూ జనాభా 20%గా ఉంది. స్వాతంత్ర్యం నాటికి కశ్మీర్ పాలకుడైన మహారాజా హరిసింగ్ కశ్మీర్‌ను భారత్‌లో కానీ, పాకిస్తాన్లో కానీ విలీనం చేయకుండా స్వతంత్రంగా ఉంచాడు. కశ్మీర్ ప్రజలు షేర్–ఏ–కశ్మీర్‌గా పిలిచే షేక్ అబ్దుల్లా నాయకత్వంలో భారతదేశంలో విలీనం కావాలని కోరారు. ఇతను 1932లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని స్థాపించాడు. 1946లో హరిసింగ్‌కు వ్యతిరేకంగా క్విట్ ఉద్యమాన్ని షేక్ అబ్దుల్లా ప్రారంభించాడు.
విలీనంపై సంతకం
కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని పాకిస్తాన్ కోరింది. 1947, అక్టోబర్‌లో పాకిస్తాన్ సైన్యం కశ్మీర్లోకి చొరబడి ఆక్రమించడానికి ప్రయత్నించింది. దీంతో హరిసింగ్ భారత్ సహాయాన్ని కోరాడు. 1947, అక్టోబర్ 26న భారత్‌లో కశ్మీర్ విలీనానికి సంబంధించి హరిసింగ్ అంగీకార ఒప్పంద పత్రంపై సంతకం చేశాడు. రాజా హరిసింగ్, జవహర్లాల్ నెహ్రూ మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా రాజా హరిసింగ్, భారత్ సైన్యాల సహాయంతో పాకిస్తాన్ సైన్యంతో పోరాడాడు. దీంతో పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం జరిగింది. ప్రాణ, ఆస్తి నష్టం అధికంగా జరగడంతో యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతూ జవహర్లాల్ నెహ్రూ కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితిని కోరాడు. యూఎన్ఓ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అంతేగాక ఏడాదిలోపు కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ
జరగాలని ఆదేశించింది. పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన వాయవ్య కశ్మీర్ పాకిస్తాన్ ఆధీనంలో ఉండిపోయింది.
హైదరాబాద్: భారత స్వాతంత్ర్యం నాటికి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధీనంలో ఉండేది. ఇతని ప్రధాని ఛత్తారి నవాబు. 1947, ఆగస్టు 15 నాటికి హైదరాబాద్ భారత్‌లో విలీనం కాలేదు. తాను స్వతంత్రంగా ఉంటానని ఏడో నిజాం 1947, ఆగస్టు 27న ఒక ఫర్మానా జారీ చేశాడు. అదే సమయంలో మౌంట్‌బాటన్‌తో చర్చలు జరపడానికి నిజాం ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాడు. ఢిల్లీలో చర్చలు విఫలమైతే తాను పాకిస్తాన్లో విలీనం అవుతానని నిజాం హెచ్చరించాడు. చివరకు 1947, నవంబర్ 29న నిజాం యథాతథ స్థితి ఒప్పందంపై సంతకం చేశాడు. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించింది హైదరాబాద్ ప్రధాని ఛత్తారి నవాబు. రజాకార్ల నాయకుడైన కాశీం రజ్వీ ఒత్తిడితో నిజాం లాయక్ అలీని ప్రధానిగా చేశాడు. యథాతథస్థితి ఒప్పందంపై సంతకం చేసిన నిజాం దానిని పాటించక భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకున్నాడు. గోల్కొండ, చాదర్‌ఘాట్, మోతీమహల్లో ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌లో రజాకార్ల అకృత్యాలు ఎక్కువవడంతో శాంతిభద్రతలు క్షీణించాయి.
పోలీసు చర్య
యథాతథ స్థితి ఉల్లంఘించినందుకు అప్పటి హైదరాబాద్ సంస్థానంలో భారత దేశ సంస్థానాల వ్యవహారాల కార్యదర్శి వి.పి.మీనన్‌ను నిజాంతో సంప్రదింపులకు పంపింది. సంప్రదింపులు విఫలం కావడం, హైదరాబాద్‌లో రజాకార్ల అకృత్యాలు అధికం కావడంతో దీంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం నిజాంను లొంగదీసుకోవడానికి 1948, సెప్టెంబర్ 13న సైనిక చర్య చేపట్టింది. సెప్టెంబర్ 13–17 మధ్య జరిగిన సైనిక చర్యలో నిజాం సైన్యాలు ఓడిపోవడంతో మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. 1948, సెప్టెంబర్ 18న జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పడింది
నాగఢ్: కథియావాడ్లోని జునాగఢ్ ప్రాంతం 1807 నుంచి బాబి వంశం ఆధీనంలో ఉంది. ఈ వంశ స్థాపకుడు మహ్మద్ షేర్‌ఖాన్ బాబి. ఈ ప్రాంతాన్ని 1911–1948 వరకు పాలించిన నవాబు మహ్మద్ మహబ్బత్ ఖాన్–3. ఇతని ప్రధాని షానవాజ్ భుట్టో. ఇక్కడ హిందువుల జనాభా ఎక్కువ (75%). వీరంతా జునాగఢ్ ఇండియాలో విలీనం కావాలని కోరుకున్నారు. కానీ నవాబ్ భారత స్వాతంత్ర్యం పొందే నాటికి జునాగఢ్ పాకిస్తాన్లో విలీనం అవుతున్నట్లు ప్రకటించాడు. దీంతో కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో ధేబర్, బల్వంత్రాయ్ మెహతా, శ్యామల్‌దాస్ గాంధీ, రసీఖ్లాల్ పాల్గొన్నారు. శ్యామల్‌దాస్ జునాగఢ్‌లో పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమని ప్రకటించి బొంబాయి నుంచి రాజ్‌కోట్ వరకు జైత్రయాత్రను జరిపాడు. 1947, నవంబర్ 7న భారత సైన్యాలు జునాగఢ్‌ను ఆక్రమించాయి. పాలనా యంత్రాంగాన్ని పునర్ వ్యవస్థీకరించడానికి ప్రభుత్వం ఎస్.డబ్ల్యూ.శివేశ్వరార్కర్ను నియమించింది. 1948, జనవరి 20న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణను అనుసరించి జునాగఢ్ భారత్ వశమైంది.
యథాతథ స్థితి ఒప్పందం
హైదరాబాద్ రాజ్యంలో నిజాంపై వ్యతిరేకత అధికం కావడంతో మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారతదేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంలో చటారీ నవాబ్ కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ సంస్థానానికి, భారతదేశానికి మధ్య లార్డ్ మౌంట్ బాటన్ చొరవతో యథాతథ ఒప్పందం కుదిరింది. యథాతథస్థితి ఒప్పందం ప్రకారం ప్రముఖ వాస్తు శిల్పి జైన్యార్జంగ్ ఢిల్లీలో హైదరాబాద్ ఏజెంట్ జనరల్‌గా హైదరాబాద్‌లో భారతదేశ ఏజెంట్ జనరల్‌గా కేఎం మున్షీ నియామకమయ్యారు. ఈయన హైదరాబాద్‌లోని బొల్లారంలోని సైనిక బంగ్లాలో నివసించాడు.
- - హైదరాబాద్ భారతదేశంలో ఒక అనుబంధ రాజ్యంగా ఉండాలి.
- ఒక సంవత్సరంలోపు హైదరాబాద్ ప్రజలు కోరుకున్న విధంగా ప్రభుత్వం ఏర్పడాలి.
- హైదరాబాద్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, రవాణా పూర్తిగా భారతదేశ ఆధీనంలో ఉంటుంది.
- భారతదేశ కరెన్సీ హైదరాబాద్‌లో చెల్లుతుంది.
- హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అరెస్టయిన ఇతర నాయకులను విడుదల చేయాలి.
- భారతదేశ బ్యాంకులు, బీమా కంపెనీలు యథేచ్ఛగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు.
- తక్షణమే హైదరాబాద్‌లో వాక్, భావ ప్రకటన స్వాతంత్ర్యాలు కల్పించాలి.
- భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం సంభవిస్తే హైదరాబాద్ తటస్థంగా ఉండాలి.